Nobel Peace Prize: నోబెల్ శాంతి బహుమతి రేసులో ట్రంప్.. ఎన్నో మైనస్ పాయింట్లు
ఇటువంటి రక్త చరిత్ర కలిగిన అమెరికాకు అధ్యక్షుడిగా ఎన్నికైనందుకేనా ట్రంప్‌కు(Nobel Peace Prize) నోబెల్ శాంతి బహుమతిని ఇచ్చేది? అని అంతర్జాతీయ వ్యవహారాల పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
- By Pasha Published Date - 10:43 AM, Sat - 24 May 25

Nobel Peace Prize: నోబెల్ శాంతి బహుమతి రేసులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూసుకుపోతున్నారు. వికీ లీక్స్ ఫౌండర్ జులియన్ అసాంజే, రష్యా ప్రతిపక్షనేత దివంగత అలెక్సీ నావెల్సీ భార్య యూలియా నావల్నయాల కంటే ట్రంప్ ముందు వరుసలో ఉన్నట్లు కథనాలు వస్తున్నాయి. నోబెల్ శాంతి బహుమతి కోసం 338 మంది అభ్యర్థులను ఈ ఏడాది మార్చి 5న నోబెల్ పీస్ ప్రైజ్ కమిటీ నామినేట్ చేసింది. వీరిలో 244 మంది వ్యక్తులు ఉండగా, 94 సంస్థలు ఉన్నాయి. 2024తో పోలిస్తే ఈ ఏడాదిలో నామినేటెడ్ అభ్యర్థుల సంఖ్య పెరిగింది. 2024లో కేవలం 286 మందే నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు. ట్రంప్ ఇంతకుముందు కూడా అనేకసార్లు ఈ అవార్డుకు నామినేట్ అయ్యారు. కానీ పురస్కారం మాత్రం వరించలేదు. ఈసారీ అదే జరగొచ్చని అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు నలుగురు అమెరికా అధ్యక్షులకు నోబెల్ శాంతి బహుమతిని ఇచ్చారు. ఈ జాబితాలో ట్రంప్ కూడా చేరుతారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు ఈ ప్రైజ్‌ను అందుకున్న అమెరికా ప్రెసిడెంట్లలో థియోడర్ రూజ్వెల్ట్(1906), వుడ్రో విల్సన్(1919), జిమ్మీ కార్టర్(2002), బరాక్ ఒబామా(2009) ఉన్నారు. ఇక నోబెల్ ప్రైజ్ విజేతలను ఈ ఏడాది అక్టోబర్ 10న ప్రకటిస్తారు. డిసెంబర్ 10న నార్వేలోని ఓస్లో నగరంలో వీటిని ప్రదానం చేస్తారు.
Also Read :Jr NTR : జూనియర్ ఎన్‌టీఆర్‌కు ప్రైవేటు విమానం ఉందా ?
ట్రంప్‌కు ఎన్నో మైనస్ పాయింట్లు
- గాజాలో ఇజ్రాయెల్- హమాస్ మధ్య శాంతి చర్చలు, రష్యా- ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలు, భారత్ – పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ వంటి అంశాలను ట్రంప్ తన గొప్పలుగా చెప్పుకుంటున్నారు. అమెరికా నుంచి అందిన ఆయుధాలతో.. కొన్ని నెలల వ్యవధిలోనే పాలస్తీనాలోని 50వేల మంది ప్రాణాలను ఇజ్రాయెల్ తీసింది. ఇటువంటి రక్త చరిత్ర కలిగిన అమెరికాకు అధ్యక్షుడిగా ఎన్నికైనందుకేనా ట్రంప్‌కు(Nobel Peace Prize) నోబెల్ శాంతి బహుమతిని ఇచ్చేది? అని అంతర్జాతీయ వ్యవహారాల పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
- అమెరికా నుంచి అందిన ఆయుధాల వల్లే అగ్రరాజ్యం రష్యాతో ఉక్రెయిన్ గత రెండున్నర ఏళ్లుగా యుద్ధం చేయగలుగుతోంది. లేదంటే కేవలం ఆరు నెలల్లోనే ఉక్రెయిన్‌లోని మెజారిటీ భూభాగంపై రష్యా సైన్యానికి పట్టు వచ్చి ఉండేది. తాము ఇచ్చిన ఆయుధాలకు బదులుగా ఉక్రెయిన్‌లోని సహజ వనరులపై అమెరికా కన్నేసింది. ఇలాంటి యుద్ధోన్మాదం, వ్యాపార వైఖరి ఉన్నందుకేనా అమెరికా తరఫున అధ్యక్షుడైన ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతిని ఇచ్చేది ? అని పరిశీలకులు నిలదీస్తున్నారు.
- భారత్, పాకిస్తాన్‌లు స్వయంగా చర్చలు జరుపుకొని కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. అయితే ఇందులో తన పాత్ర ఉందంటూ ట్రంప్ గొప్పల డప్పు కొట్టుకుంటున్నారు. ఈ అబద్ధపు ప్రచారం చేసుకుంటున్నందుకేనా ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతిని ఇచ్చేది? అని పరిశీలకులు అడుగుతున్నారు.
- ఉగ్రవాద నిలయమైన పాకిస్తాన్‌కు ఆయుధాలను అందిస్తున్న తుర్కియే (టర్కీ)కు రూ.వేల కోట్లు విలువైన అమ్రామ్ మిస్సైళ్లను అమ్మేందుకు ఇటీవలే అమెరికాలోని ట్రంప్ సర్కారు పచ్చజెండా ఊపింది. ఉగ్రవాద దేశమైన పాకిస్తాన్‌కు ఈవిధంగా పరోక్షసాయం చేస్తున్నందుకేనా ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతిని ఇచ్చేది? అని భారత ప్రజానీకం ప్రశ్నిస్తున్నారు.
- డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం అమెరికాలోని ఆయుధ తయారీ కంపెనీలకు బ్రోకర్‌గా మారిపోయారు. అందుకే తమ దేశం నుంచే ఆయుధాలు కొనాలని ప్రపంచ దేశాలపై ఒత్తిడిని పెంచుతున్నారు. లేదంటే ఆంక్షలు విధిస్తానని, దిగుమతి సుంకాలు పెంచుతానని ట్రంప్ బ్లాక్ మెయిలింగ్‌కు దిగుతున్నారు. ఇవన్నీ చేస్తున్నందుకే ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతిని ఇవ్వాలా ? అని అందరూ ప్రశ్నను సంధిస్తున్నారు.
- ఈ మైనస్ పాయింట్లన్నీ ఉన్నందున ఈసారి ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతి రాకపోవచ్చని అంటున్నారు.