H-1B Visa Fee : వీసా ఫీజు పెంపుపై గందరగోళం.. ఆగిన పెళ్లిళ్లు
H-1B Visa Fee : అమెరికా ప్రభుత్వం తీసుకున్న H-1B వీసా ఫీజు పెంపు నిర్ణయం అనేక మంది ఐటీ ప్రొఫెషనల్స్ జీవితాల్లో గందరగోళ పరిస్థితులను సృష్టించింది. నిన్న ఈ వార్త బయటకు రావడంతో అమెరికాలో పనిచేస్తున్న అనేక మంది భారతీయులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు
- By Sudheer Published Date - 09:02 PM, Sun - 21 September 25

అమెరికా ప్రభుత్వం తీసుకున్న H-1B వీసా ఫీజు పెంపు నిర్ణయం అనేక మంది ఐటీ ప్రొఫెషనల్స్ జీవితాల్లో గందరగోళ పరిస్థితులను సృష్టించింది. నిన్న ఈ వార్త బయటకు రావడంతో అమెరికాలో పనిచేస్తున్న అనేక మంది భారతీయులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ముఖ్యంగా, ఇప్పటికే H-1B వీసాతో పనిచేస్తున్న వారూ ఈ ఫీజు పెంపు తమపైనా వర్తిస్తుందని భావించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో తమ ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఇండియాకు పెళ్లికి వెళ్లాలి, కానీ తిరిగి రావాలంటే రూ.80 లక్షలు చెల్లించాలి’ అనే భయంతో టికెట్లు క్యాన్సిల్ చేసుకున్నట్లు కొందరు తెలిపారు. ఇది వారి కుటుంబాల్లో ఆందోళనకు దారితీసింది.
Heavy Rains: రానున్న మూడు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు!
ఒక యువతి తన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ “ఇది అన్యాయం. నేను రాలేకపోతున్నానని తెలిసి మా అమ్మ ఏడ్చేసింది” అని పేర్కొంది. ఈ ఒక్క ఉదాహరణతోనే వీసా ఫీజు పెంపు నిర్ణయం ఎంత కలకలం రేపిందో అర్థమవుతోంది. అమెరికాలో నివసిస్తున్న భారతీయులలో చాలామందికి H-1B వీసా ఒకే ఆప్షన్ కావడంతో, చిన్న మార్పులే అయినా వారి జీవన విధానంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి. పెళ్లిళ్లు, ఫ్యామిలీ ఫంక్షన్లు, అత్యవసర సందర్భాల్లో ఇండియాకు రావడం-వెళ్లడం అనే అంశాలు ఎల్లప్పుడూ H-1B హోల్డర్లకు సవాల్‌గానే ఉంటాయి. ఇప్పుడు ఫీజుల అంశం రావడంతో వారు మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అయితే అమెరికా అధికారులు తర్వాత స్పష్టతనిచ్చారు. ఈ ఫీజు పెంపు ఇప్పటికే వీసా ఉన్న వారికీ వర్తించదని, ఇది కొత్త దరఖాస్తుదారులకే పరిమితమని. అయినప్పటికీ మొదటి రోజు వచ్చిన తప్పుదారుణ సమాచారం కారణంగా ఎన్నో మంది నిర్ణయాలు మార్చుకోవాల్సి వచ్చింది. ఈ గందరగోళం వల్ల కలిగిన మానసిక ఒత్తిడి, కుటుంబ సంబంధిత నిరాశలు తీరనివి. నిపుణులు అభిప్రాయపడుతున్నట్లుగా, ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో అమెరికా ప్రభుత్వం ముందుగానే స్పష్టత ఇవ్వకపోతే వీసా హోల్డర్ల జీవితాల్లో తలెత్తే సమస్యలు మరింతగా పెరుగుతాయని చెబుతున్నారు.