Secret Documents: అమెరికా రహస్య పత్రాలు బహిర్గతం?.. బైడెన్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు!
అమెరికా అంటే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది రక్షణ వ్యవస్థ. ప్రపంచంలో ఏ దేశంలో ఏం జరిగినా ముందుగా పసిగట్టే అమెరికా..
- By Anshu Published Date - 10:23 PM, Sun - 22 January 23

Secret Documents: అమెరికా అంటే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది రక్షణ వ్యవస్థ. ప్రపంచంలో ఏ దేశంలో ఏం జరిగినా ముందుగా పసిగట్టే అమెరికా.. తన సొంత దేశ వ్యవహారాల్లో ఇబ్బంది పడుతోంది. అమెరికాకు సంబంధించిన కీలక, రహస్య పత్రాలు అమెరికా అధ్యక్షుడు బహిర్గతం చేశాడనే వార్తలు వినిపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా ఉన్న జో బైడెన్.. దేశానికి సంబంధించిన రహస్య పత్రాలు అత్యంత సురక్షితంగా ఓ సీల్డ్ డబ్బాలో ఉన్నాయని ప్రకటించారు.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రహస్య పత్రాలు సురక్షితంగా ఉన్నాయని ప్రకటించిన వారం తర్వాత న్యూయార్క్ పోస్ట్ సంచలన కథనం వెలువరించింది. అమెరికాకు చెందిన అత్యంత రహస్య పత్రాలు బైడెన్ ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ పడేసి ఉన్నట్లు పేర్కొంది. దీనికి తోడు ఆ రహస్య పత్రాలు అక్కడ ఉన్న సమయంలో బైడెన్ కుమారుడు హంటర్ పలుమార్లు ఇంటికి వెళ్లినట్లు పేర్కొంది.
ఈ కథనం వల్ల దేశంలో రహస్య పత్రాల మీద పెద్ద దుమారం రేగింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆయన సతీమణి ఇంట్లో లేని సమయంలో అధికారులు గుట్టుచప్పుడు కాకుండా సోదాలు చేయగా.. కీలక, రహస్య పత్రాలు లభించినట్లు తెలుస్తోంది. దీంతో జో బైడెన్ అమెరికా దేశానికి సంబంధించిన రహస్య పత్రాలను సంరక్షించలేదని తెలుస్తోంది. అయితే జో బైడెన్ కొడుకు హంటర్ బైడెన్ వాడిన ల్యాప్ టాప్ లో కూడా కొన్ని ముఖ్యమైన ఫైల్స్ ఉండటం కలవరం రేపింది.
హంటర్ బైడెన్ వాడిన ల్యాప్ టాప్ లో కీలక పత్రాలు ఉండగా.. ఆ ల్యాప్ టాప్ ని రిపేర్ చేసిన వ్యక్తి.. ఆ ల్యాప్ టాప్ లోని డాటాను రికవర్ చేశాడు. అయితే అందులో హంటర్ డ్రగ్స్ తీసుకుంటున్న ఫోటోలతో పాటు దేశానికి సంబంధించిన పలు ముఖ్యమైన ఫైల్స్ ఉన్నాయి. అవి చివరకు న్యూయార్క్ పోస్ట్ కు చేరగా.. ఆ పత్రిక వాటిపై సంచలన కథనం పబ్లిష్ చేసింది.