Plane Crash : జనావాసాల్లో కుప్పకూలిన విమానం.. 62 మంది ప్రయాణికుల మృతి
బ్రెజిల్‌లో ఈ మధ్యకాలంలో విమాన ప్రమాదాలు ఎక్కువై పోయాయి.
- By Pasha Published Date - 07:51 AM, Sat - 10 August 24

Plane Crash : బ్రెజిల్‌లో ఈ మధ్యకాలంలో విమాన ప్రమాదాలు ఎక్కువై పోయాయి. తాజాగా 62 మందితో ప్రయాణిస్తున్న ప్రాంతీయ టర్బోప్రాప్ విమానం సావోపాలో నగరం సమీపంలోని విన్హెడో పట్టణలో కూలిపోయింది. దీంతో విమానంలోని వారందరూ మరణించారు. పరానా రాష్ట్రంలోని కాస్కావెల్ నుంచి సావో పాలో నగరంలో ఉన్న ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆ విమానం బయలుదేరింది. సావో పాలో నగరానికి వాయవ్య దిశలో 80 కి.మీ దూరంలో ఉన్న విన్హెడో పట్టణం వద్దకు చేరుకోగానే విమానంపై పైలట్ కంట్రోల్ కోల్పోయాడు. దీంతో విమానం గింగిరాలు తిరగడం మొదలుపెట్టింది. చివరకు అది నగరంలోని జనావాస ప్రదేశంలోనే(Plane Crash) కూలిపోయింది. దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
We’re now on WhatsApp. Click to Join
విన్హెడో పట్టణంలో విమానం కూలిన చోట ఒక ఇల్లు తీవ్రంగా దెబ్బతిందని అధికారులు గుర్తించారు. స్థానికులు ఎవరికీ గాయాలు కాలేదని వెల్లడైంది. వెంటనే రెస్క్యూ టీమ్స్ సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. విమాన శకలాలను అక్కడి నుంచి తొలగించాయి. విమానంలోనే ప్రాణాలు విడిచిన 62 మంది డెడ్ బాడీస్‌ను పోస్టుమార్టం నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అనంతరం వాటిని వారి బంధువులకు అప్పగించారు. PS-VPB రిజిస్ట్రేషన్ కలిగిన ఉన్న ఈ విమానం కూలిపోవడానికి కారణం ఏమిటనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. సంబంధిత విమానయాన సంస్థ ‘ఏటీఆర్ 72-500 టర్బోప్రాప్’ దీనిపై ఇంకా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. ఏటీఆర్ కంపెనీని ఎయిర్ బస్, ఇటలీకి చెందిన ఏరోస్పేస్ గ్రూప్ లియోనార్డో సంయుక్తంగా ఏర్పాటు చేశాయి.
Also Read :Aman Sehrawat: భారత్‌కు ఆరో మెడల్.. రెజ్లర్ అమన్ సెహ్రావత్‌కు కాంస్యం
ఈ ఘటనపై బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో చనిపోయిన వారి కోసం ఒక్క నిమిషం మౌనం పాటించి సంతాపం ప్రకటించారు. విమాన ప్రమాదంలో చనిపోయిన వారి కోసం దేశ ప్రజలంతా ఒక్క నిమిషం మౌనం పాటించాలని పిలుపునిచ్చారు.