viral Video : రైలులోని టాయిలెట్ ను బెడ్ రూమ్ గా మార్చేసుకున్న ప్రయాణికుడు
- By Vamsi Chowdary Korata Published Date - 11:41 AM, Sat - 25 October 25
పండుగల సమయాల్లో రైళ్లలో రద్దీ గురించి చెప్పనక్కర్లేదు. రైలు ఎక్కడానికి చిన్నపాటి యుద్ధమే చేయాల్సి వస్తుంది.. లోపల కాలు పెట్టేందుకూ చోటు దొరకదు. పండుగకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామని రైల్వే శాఖ ప్రకటించినా జనం రద్దీకి అవేవీ సరిపోవు. ఒంటికాలిపై నిలబడి ప్రయాణం చేయాల్సి వస్తుందని చాలామంది వాపోతుంటారు.
ఇటీవల జరిగిన దీపావళి పండుగకు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. అయితే, ఒక ప్రయాణికుడు మాత్రం తనతో పాటు ఇంట్లోని సామాన్లు పట్టుకుని రైలు ఎక్కాడు. రైలులోని టాయిలెట్ ను పూర్తిగా ఆక్రమించి, దానిని తన బెడ్ రూమ్ లా మార్చేసుకున్నాడు. లోపల తన సామాన్లు సర్దుకుని, ఒక పరుపును ఏర్పాటు చేసుకున్నాడు. హాయిగా పడుకునే ఏర్పాట్లు చేసుకుని మరీ ప్రయాణం సాగించాడు. రైలు ప్లాట్ ఫాంపై ఆగినపుడు ఓ యూట్యూబర్ ఈ ప్రయాణికుడి నిర్వాకాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.
ఈ వీడియో వైరల్ కావడంతో ఇన్ స్టాలో దాదాపు 8 లక్షల మంది ఈ వీడియోను చూశారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. ప్రయాణికుల రద్దీకి తగినట్టు రైళ్లను నడపడంలో రైల్వే శాఖ ప్రతిసారీ విఫలమవుతోందని విమర్శించారు. అదే సమయంలో ఇటు ప్రయాణికుడి తీరు బాధ్యతారహితంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలే రద్దీగా ఉన్న రైలులో ప్రయాణికులకు కాలకృత్యాలు తీర్చుకునే వీలులేకుండా టాయిలెట్ ను ఆక్రమించడంపై మండిపడుతున్నారు