Karnataka: దానిమ్మ తోటకు భారీగా బందోబస్తు.. తుపాకీ, కారం పొడితో గస్తీ?
ఈ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా చాలావరకు ప్రజలు దిగజారిపోయి ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా రైతుల కడుపు కొట్టడానికే చూస్తున్నారు. మొన్నటికి మొన్న
- By Anshu Published Date - 03:43 PM, Sun - 20 August 23

ఈ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా చాలావరకు ప్రజలు దిగజారిపోయి ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా రైతుల కడుపు కొట్టడానికే చూస్తున్నారు. మొన్నటికి మొన్న టమాట ధరలు ఆకాశాన్నంటడంతో చాలామంది దుర్మార్గులు టమోటాల కోసం రైతులను చంపడం కొట్టడం లాంటివి చేసిన విషయం తెలిసిందే. దీంతో టమాటా రైతులు వారిని రక్షించుకోవడానికి అలాగే దొంగల నుంచి పంటలను రక్షించడం కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు దానిమ్మ వంతు వచ్చింది.
ప్రస్తుతం మార్కెట్లో దానిమ్మ ధర కేజీ 150 నుంచి 250 వరకు పలుకుతుండడంతో దానిమ్మకు కూడా టమోటాలకు పట్టిన దుస్థితి పడుతోంది. దాంతో రైతులు దానిమ్మ తోటను రక్షించుకోవడం కోసం నానా తంటాలు పడుతున్నారు. ఇలాంటి సంఘటన ఇప్పుడు తాజాగా కర్ణాటకలో చోటుచేసుకుంది. కర్ణాటక లోని చిక్కబళ్లాపుర జిల్లా కేంద్రం పరిధిలోని నాయనహళ్లి అందార్లహళ్లి, చదలపుర, నంది తదితర గ్రామాలలో దానిమ్మ తోటలను రైతులు తుపాకులతో కాపలా కాస్తున్నారు. దానిమ్మ పండ్లు ప్రస్తుతం కేజీ ధర రూ.150 నుంచి 200 మరికొన్ని ప్రదేశాలలో 250 వరకు పలుకుతోంది.
దీంతో కొందరు దొంగలు తరచూ తోటల్లోకి దొంగలు చొరబడి పండ్లను ఎత్తుకెళ్తున్నారు. రైతులు కూడా చేసేదేమీ లేక రాత్రి వేళలో కాపలా కాస్తున్నారు. నాయనహల్లి గ్రామంలో రైతు చందన్ రెండు ఎకరాలలో రూ. 5 లక్షల ఖర్చుపెట్టి దానిమ్మ పంట పండిస్తున్నాడు. వారం కిందట ఈయన తోటలో దొంగలు పడి సుమారు టన్ను బరువైన దానిమ్మ పండ్లను దొంగిలించుకొనిపోయారు. పక్కనే దేవరాజ్ తోటలోనూ ఇంతేమొత్తంలో దానిమ్మను ఎత్తుకెళ్లారు. చదలపురంలో మునిరాజు అనే రైతు తమ చుట్టాలను ఇంటికి పిలిపించుకొని రాత్రి వేళలో తుపాకీ, కారంపొడి పట్టుకొని గస్తీ కాస్తున్నారు. తుపాకీకి లైసెన్స్ ఉందని తెలిపారు. ఈయన ఆరు ఎకరాలలో దానిమ్మ సాగు చేస్తున్నారు. ఒకవేళ దొంగలు కానీ చేతికి చిక్కితే వారి పని అయిపోయినట్టే అంటున్నారు తోటల యజమానులు.