Fastest Triple Century :147 బాల్స్‌లో ట్రిపుల్ సెంచరీ.. హైదరాబాదీ క్రికెటర్ వరల్డ్ రికార్డ్
Fastest Triple Century : 21 సిక్స్‌లు, 33 ఫోర్లతో కేవలం 147 బంతుల్లోనే మన హైదరాబాదీ బ్యాటర్ తన్మయ్ అగర్వాల్ (Tanmay Agarwal) ట్రిపుల్ సెంచరీ చేశాడు.
- Author : Pasha
Date : 27-01-2024 - 7:09 IST
Published By : Hashtagu Telugu Desk
Fastest Triple Century : 21 సిక్స్‌లు, 33 ఫోర్లతో కేవలం 147 బంతుల్లోనే మన హైదరాబాదీ బ్యాటర్ తన్మయ్ అగర్వాల్ (Tanmay Agarwal) ట్రిపుల్ సెంచరీ చేశాడు. శుక్రవారం అరుణాచల్ ప్రదేశ్ క్రికెట్ టీమ్‌తో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో ఈ సరికొత్త రికార్డును 28 ఏళ్ల తన్మయ్ క్రియేట్ చేశాడు. దీంతో ఇప్పటివరకు దక్షిణాఫ్రికా క్రికెటర్ మార్కో మరైస్ (Marco Marais) పేరిట ఉన్న రికార్డు బద్దలైంది. 2017 సంవత్సరంలో మార్కో 191 బంతుల్లోనే ట్రిపుల్ సెంచరీతో రికార్డును నెలకొల్పాడు. ఆ రికార్డు బద్ధలు కొట్టడం సాధ్యం కాకపోవచ్చని అందరూ అనుకున్నారు. కానీ ఆ అసాధ్యాన్ని మన తన్మయ్ సుసాధ్యం చేసి చూపించాడు. ఇదే క్రమంలో తన్మయ్ భారత దేశవాళీ క్రికెట్లో అత్యంత వేగంగా డబుల్ సెంచరీ (200; 119 బంతుల్లో) సాధించిన ఆటగాడిగానూ రికార్డు నెలకొల్పాడు. ఇతడు గతంలో 119 బంతుల్లోనే డబుల్ సెంచరీ కొట్టాడు. 39 ఏళ్ల క్రితం రవిశాస్త్రి 123 బంతుల్లో డబుల్ సెంచరీ చేశాడు. రంజీ ట్రోఫీలో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధికంగా 14 సిక్సర్లు కొట్టి ఇషాన్ కిషన్ నెలకొల్పిన రికార్డును కూడా తన్మయ్ బ్రేక్ చేశాడు. మన తన్మయ్ ఒక ఇన్నింగ్స్‌లో తాజాగా 21 సిక్సర్లు కొట్టడం విశేషం.
మ్యాచ్ ఇలా సాగుతోంది..
శుక్రవారం అరుణాచల్ ప్రదేశ్‌తో ప్రారంభమైన రంజీ ట్రోఫీ ప్లేట్ డివిజన్ మ్యాచ్ ఈ రికార్డుకు(Fastest Triple Century) వేదికైంది. మొదట అరుణాచల్ 39.4 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌటైంది. సీవీ మిలింద్ (3/36), కార్తికేయ (3/28) మూడేసి వికెట్లతో రాణించారు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 48 ఓవర్లలో ఒక వికెట్‌కు 529 పరుగుల భారీ స్కోరును సాధించింది. తన్మయ్ 147 బంతుల్లో 323 రన్స్ చేయగా.. కెప్టెన్ రాహుల్ సింగ్ 105 బంతుల్లో 185 పరుగులు చేశారు. దీంతో మొదటి వికెట్‌కు ఇద్దరూ కలిసి 449 పరుగులు జోడించారు. ప్రస్తుతం హైదరాబాద్ 357 పరుగుల ఆధిక్యంలో ఉంది.
We’re now on WhatsApp. Click to Join.
ట్రిపుల్ సెంచరీ పాత రికార్డులు
- 2017-18లో దక్షిణాఫ్రికాకు చెందిన మార్కో మరియస్ 191 బంతుల్లో 300 కొట్టాడు.
- న్యూజిలాండ్‌కు చెందిన కెన్ రూథర్‌ఫర్డ్ 234 బంతుల్లో 300 కొట్టాడు.
- వెస్టిండీస్‌కు చెందిన వివ్ రిచర్డ్స్ 244 బంతుల్లో 300 కొట్టాడు.
- శ్రీలంకకు చెందిన కుశాల్ పెరీరా 244 బంతుల్లో 300 కొట్టాడు.
విహారి, రికీ శతకాలు
గాదె హనుమ విహారి (119 బ్యాటింగ్; 243 బంతుల్లో 15×4, 3×6), కెప్టెన్ రికీ భుయ్ (120; 201 బంతుల్లో 14×4) సెంచరీలతో కదంతొక్కడంతో చత్తీస్‌గఢ్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఎలీట్ గ్రూపు-బి మ్యాచ్‌లో ఆంధ్ర భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. తొలి రోజుజు, శుక్రవారం ఆట చివరికి ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 4 వికెట్లకు 277 పరుగులు సాధించింది.