Tulbul project : పాక్‌కు అడ్డుకట్ట..తుల్‌బుల్ ప్రాజెక్టు పునరుద్ధరణపై కేంద్రం యోచన..!
ఈ నిర్ణయం వల్ల ఇప్పటికే పాకిస్థాన్‌లో నీటి కొరత మొదలైనట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ పశ్చిమ నదుల నీటిని మరింతగా సద్వినియోగం చేసుకోవాలని తలంపుతో కొన్ని ప్రాజెక్టులను తిరిగి ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతోంది.
- By Latha Suma Published Date - 05:40 PM, Thu - 26 June 25

Tulbul project : పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సరిహద్దులలో తరచూ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్‌కు బుద్ధిచెప్పేందుకు దేశం ఇప్పుడు నీటి దారులను వదిలిపెట్టడం లేదు. ఇందుకు భాగంగా సింధూ జలాల ఒప్పందం అమలును నిలిపివేస్తూ భారత ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నిర్ణయం వల్ల ఇప్పటికే పాకిస్థాన్‌లో నీటి కొరత మొదలైనట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ పశ్చిమ నదుల నీటిని మరింతగా సద్వినియోగం చేసుకోవాలని తలంపుతో కొన్ని ప్రాజెక్టులను తిరిగి ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ముఖ్యంగా జమ్మూ కశ్మీర్‌లోని తుల్‌బుల్ నావిగేషన్ ప్రాజెక్టుపై మళ్లీ దృష్టి సారించింది. సుదీర్ఘకాలంగా నిలిచిపోయిన ఈ ప్రాజెక్టు పునరుద్ధరణకు సంబంధించి చర్చలు తుది దశలో ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
Read Also: CM Chandrababu : ఆంధ్రప్రదేశ్‌కు ‘స్పేస్ పాలసీ 4.0’ తో నూతన దిశ : సీఎం చంద్రబాబు
ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ (డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్) ప్రస్తుతం సిద్ధమవుతుండగా, వచ్చే ఏడాదిలో ఇది పూర్తి అవుతుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. తుల్‌బుల్ ప్రాజెక్టుతో పాటు పశ్చిమ నదులైన జీలం, చీనాబ్ నదుల నీటిని దేశ అవసరాల కోసం మరింతగా వాడుకునే మార్గాలను భారత ప్రభుత్వం విశ్లేషిస్తోంది. ఇదిలా ఉండగా, పంజాబ్, హరియాణా వంటి రాష్ట్రాలకు నీటిని మళ్లించే అవకాశాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. అంతేకాక, దేశంలోని నీటి నిల్వ సామర్థ్యాన్ని మెరుగుపర్చే దిశగా కొన్ని కీలక ప్రణాళికలు రూపుదిద్దుకుంటున్నాయి. డ్రై సీజన్‌లో కొంతమేర నిల్వ ఉంటున్నా, వర్షాకాలంలో అధిక నీరు దిగువన పాకిస్థాన్‌కు వెళ్లిపోతున్నదే ప్రధాన సవాలు.
1960 సెప్టెంబర్ 19న భారత్, పాక్ మధ్య కుదిరిన సింధూ జలాల ఒప్పందం ప్రకారం సింధూ, జీలం, చీనాబ్ వంటి పశ్చిమ నదులపై పాకిస్థాన్‌కు 80 శాతం హక్కు ఉంది. భారత్‌కు కేవలం 20 శాతం మాత్రమే వినియోగం హక్కు లభించింది. ఇదే కారణంగా భారత్ పలు నీటి ప్రాజెక్టులు చేపట్టేందుకు పాకిస్థాన్ తరచూ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వచ్చింది. అయితే, భారత్ ఇప్పుడు వీటిపై కఠిన వైఖరితో ముందుకెళుతోంది. ఇప్పటికే కిషన్‌గంగా ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేసిన భారత్, ప్రస్తుతం రాట్లే హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టును వేగంగా కొనసాగిస్తోంది. ఈ ప్రాజెక్టులతో పాటు తుల్‌బుల్ ప్రాజెక్టును మళ్లీ ముందుకు తీసుకురావడం ద్వారా నీటి నియంత్రణపై భారత్ పట్టుదలగా ఉంది. ఇవన్నీ కలిపి చూస్తే, భారత్ ఇప్పుడు జలవనరులను అంతర్జాతీయ ఒప్పందాల పరిధిలోనే కానీ, తమ దేశ ప్రయోజనాలను రక్షించుకునే దిశగా ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తోంది. పాకిస్థాన్‌కి ఇది మేలుకోటానికి ఓ సంకేతంగా మారుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Read Also: Tragedy : ఆదిలాబాద్‌లో విషాదం.. పొంగిపొర్లుతున్న వాగులో పడి యువకుడు గల్లంతు