Ram Lalla : రామమందిరం గర్భగుడి నుంచి రామ్‌లల్లా మొదటి ఫొటో..
Ram Lalla : ఎట్టకేలకు అయోధ్య రామమందిరం గర్భగుడిలో రామ్‌లల్లా కొలువుతీరారు.
- By Pasha Published Date - 07:20 AM, Fri - 19 January 24

Ram Lalla : ఎట్టకేలకు అయోధ్య రామమందిరం గర్భగుడిలో రామ్‌లల్లా కొలువుతీరారు. రాముల వారు గర్భగుడిలో ఉన్న మొదటి ఫొటోను ఆలయ అధికారులు విడుదల చేశారు. ఐదు సంవత్సరాల వయసు కలిగిన బాలరాముడి స్వరూపాన్ని తలపించేలా విగ్రహమూర్తి ఉంది. చేతిలో ధనస్సు, వీపులో అమ్ముల పొదిని ధరించి.. కమలం పువ్వుపై నిలబడిన శ్రీరాముడు కనిపిస్తున్నాడు. దీన్ని మైసూర్ కు చెందిన కళాకారుడు అరుణ్ యోగిరాజ్ నల్లరాతితో చెక్కారు.ఈ విగ్రహం ఎత్తు 51 అంగుళాలు. ప్రస్తుతం రాముని విగ్రహాన్ని మొత్తాన్ని పరదాతో కప్పి ఉంచారు. జనవరి 20న బాలరాముడి విగ్రహం పైనుంచి కవర్ తీసివేస్తారు. అంతకుముందు గురువారం తెల్లవారుజామున వేద మంత్రోచ్ఛారణల మధ్య రామ్ లల్లా విగ్రహాన్ని గర్భగుడిలోకి తీసుకొచ్చారు. గణేశ పూజతో రాంలాలా జీవితాభిషేకం అధికారికంగా ప్రారంభమైంది. కాశీకి చెందిన ఆచార్య గణేశ్వర్ ద్రవిడ్, ఆచార్య లక్ష్మీకాంత దీక్షిత్ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు జరిగాయి. రామ్ లల్లా విగ్రహం, గర్భగుడి, యాగ మండపాన్ని పవిత్ర నదుల నీటితో అభిషేకించారు. పూజ సమయంలోనే, రామాలయంలోని గర్భగుడిలో రాంలాల జలధివస్ మరియు గంధాధివస్ జరిగాయి.మధ్యాహ్నం 1:20 గంటలకు శుభ ముహూర్తంగా గణేష్, అంబిక, తీర్థ పూజలు నిర్వహించారు. 12:30 గంటలకు వేద మంత్రోచ్ఛారణల మధ్య రాంలాలా విగ్రహాన్ని(Ram Lalla) పీఠంపై ప్రతిష్ఠించారు.అశోక్ సింహళ ఫౌండేషన్ అధ్యక్షుడు మహేశ్ భాగచంద్కా ముఖ్య అతిథిగా వ్యవహరించారు. తొలిరోజు దాదాపు ఏడు గంటల పాటు పూజలు కొనసాగాయి.
We’re now on WhatsApp. Click to Join.
జనవరి 22న ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేతుల మీదుగా రామమందిరం గర్భగుడిలోని బంగారు సింహాసనంపై అయోధ్య రామయ్యకు ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. ఇందుకోసం జనవరి 11వ తేదీ నుంచే ప్రధాని మోడీ కొన్ని నియమాలు, ఆచారాలను కచ్చితంగా పాటిస్తున్నారట. కేవలం దుప్పటితో నేలపై ప్రధాని నిద్రిస్తున్నారని, కొబ్బరి నీళ్లు మాత్రమే తాగుతున్నారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఇక జనవరి 23 నుంచి రామభక్తుల కోసం ఆలయాన్ని తెరుస్తారు. జనవరి 22న భక్తులు అధిక సంఖ్యలో ఆలయం వద్దకు రావద్దని ప్రధాని మోడీ ప్రజలను కోరిన సంగతి తెలిసిందే. మంగళవారం నుంచి ప్రతి ఒక్క భక్తునికి ఆలయంలోకి అనుమతి ఉంటుందని ప్రధాని ఇటీవల వివరించారు.
Also Read: Wash Clothes: రాత్రిపూట దుస్తులు ఉతకకూడదా.. ఉతికితే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ రోజు సెలవుపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. సోమవారం రోజు దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు ఒకపూట సెలవు ప్రకటిస్తున్నట్లు కేంద్రమంత్రి జితేంద్రసింగ్ తెలిపారు. ప్రజల విశ్వాసాలను పరిగణలోకి తీసుకొని ఒకపూట సెలవు ఇస్తున్నట్లు జితేంద్ర సింగ్ ప్రకటించారు. కేంద్ర కార్యాలయాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కేంద్ర కర్మగారాలు మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు మూసివేసి ఉంటాయని తెలిపారు.