TET : తెలంగాణలో నేడు టెట్ నోటిఫికేషన్ విడుదల
TET : ఇక ద్వితీయార్ధానికి సంబంధించిన నోటిఫికేషన్‌ను నవంబరు 4న విడుదల చేయనుంది. అయితే జనవరిలో పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆగస్టులో విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌లో ప్రభుత్వం పేర్కొంది.
- By Latha Suma Published Date - 11:08 AM, Mon - 4 November 24

TET Notification : తెలంగాణలో ఈరోజు (సోమవారం) టెట్ నోటీఫికేషన్‌ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేయనుంది. టెట్ ప్రకటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయిన నేపథ్యంలో నేడు నోటిఫికేషన్ జారీ కానుంది. రాష్ట్రంలో ఇకపై ఏడాదికి రెండుసార్లు టెట్ నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రథమార్ధానికి సంబంధించి మే 20 నుంచి జూన్ 2 వరకు ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించింది. ఇక ద్వితీయార్ధానికి సంబంధించిన నోటిఫికేషన్‌ను నవంబరు 4న విడుదల చేయనుంది. అయితే జనవరిలో పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆగస్టులో విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌లో ప్రభుత్వం పేర్కొంది.
కాగా, తెలంగాణలో గత మే నెలలో నిర్వహించిన టెట్ పరీక్షలను దాదాపు 2.35 లక్షల మంది హాజరయ్యారు. అందులో 1.09 లక్షల మంది అభ్యర్థులు అర్హత సాధించారు. అయితే డీఎస్సీ పరీక్షల నిర్వహణ కూడా పూర్తవడంతో.. ఈసారి టెట్ పరీక్ష రాసేవారి సంఖ్య స్వల్పంగా తగ్గే అవకాశం ఉంది. ఆన్‌లైన్ విధానంలో టెట్ పరీక్షలు నిర్వహిస్తుండటంతో.. కనీసం వారం పది రోజులపాటు స్లాట్లు దొరకాల్సి ఉంటుంది. దీంతో టెట్ పరీక్షలను సంక్రాంతి లోపా? ఆ తర్వాతా? అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది.
టెట్ అర్హతలకు సంబంధించి.. పేపర్-1కు డీఎడ్, పేపర్-2కు బీఎడ్ పూర్తయి ఉండాలి. వారు మాత్రమే దరఖాస్తుకు అర్హులు. దీంతోపాటు స్కూల్ అసిస్టెంట్‌గా ప్రమోషన్లకు సైతం టెట్ అర్హతను ప్రామాణికంగా నిర్ణయించడంతో.. వేలాది మంది ఇన్ సర్వీస్ టీచర్లు కూడా పరీక్షకు హాజరుకానున్నారు. టెట్ ప్రవేశపెట్టిన నాటి నుంచి ఇప్పటివరకు తొమ్మిది సార్లు పరీక్షలు నిర్వహించగా…జనవరిలో పదోసారి నిర్వహించనున్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత గత మే పరీక్షతో కలుపుకొని ఆరుసార్లు పరీక్షలు జరిపారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరంలో రెండోసారి టెట్‌ను నిర్వహిస్తుండటం విశేషం.
Read Also: Volcano Eruption : బద్దలైన అగ్నిపర్వతం.. గ్రామాలపై పడిన వేడి బూడిద.. 9 మంది మృతి