KTR : కేసీఆర్ పాలనలో తెలంగాణ సంపద పెరిగింది: కేటీఆర్
KTR : ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు సమయంలో కూడా సమైక్య పాలకులు తెలంగాణ లో రియల్ ఎస్టేట్ పడిపోతుందని భయపెట్టారని గుర్తు చేశారు. కానీ, పదేళ్ల కేసీఆర్ సుస్థిర పాలన వల్లే రాష్ట్రంలో భూముల ధరలు పెరిగాయని తెలిపారు.
- By Latha Suma Published Date - 06:04 PM, Tue - 5 November 24

Realtors Forum Meeting : హైదరాబాద్‌లోని శ్రీనగర్ కాలనీలో నిర్వహించిన తెలంగాణ రియల్టర్స్ ఫోరమ్ సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు మేలు చేయాలనే ఆలోచన పాలకులకు ఉండేది కాదని కామెంట్ చేశారు. రైతులకు ఎన్ని ఎకరాలు ఉన్నా.. నీళ్లు లేకపోయేసరికి భూములు నిరుపయోగంగా ఉండేవని తెలిపారు. తన తాతకు 400 ఎకరాల ఆస్తి ఉండేదని..అయితే అన్ని ఎకరాలు ఉన్నప్పటికీ నీళ్లు లేకపోవడంతో అవి నిరుపయోగంగా, విలువ లేకుండా ఉండేవన్నారు.
2014 ముందు రాష్ట్రంలో భూముల ధరలు చాలా తక్కువగా ఉండేవని పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు సమయంలో కూడా సమైక్య పాలకులు తెలంగాణ లో రియల్ ఎస్టేట్ పడిపోతుందని భయపెట్టారని గుర్తు చేశారు. కానీ, పదేళ్ల కేసీఆర్ సుస్థిర పాలన వల్లే రాష్ట్రంలో భూముల ధరలు పెరిగాయని తెలిపారు. ఆయన నాయకత్వంలో సాగునీటి సదుపాయాలు మెరుగలయ్యాయని కొనియాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా దెబ్బతినే పరిస్థితి వచ్చిందని, రియాల్టర్ల ఏడుపొక్కటే తక్కువైందని ఆరోపించారు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పుడు పెట్టుబడులు రావని భయపెట్టారు. ప్రత్యేక తెలంగాణ వచ్చినప్పుడు 2 రోజులు పవర్ హాలీడే ఉండేది. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కృషి వల్లే భూముల ధరలు పెరిగాయి. సాగునీరు లేకపోతే వ్యవసాయం చేయడం సాధ్యం కాదు. అదే జరిగితే సంపద సృష్టించడం అసాధ్యం. కేసీఆర్ పాలనలో 24 గంటల విద్యుత్, అనేక సంక్షేమ పథకాలు అమలు చేశాం. తెలంగాణలో సంపద పెరిగింది. సాగునీటి సదుపాయాలు మెరుగయ్యాయి. తొమ్మిదిన్నరేళ్ల బీఆర్‌ఎస్ పాలన తర్వాత తెలంగాణలో వచ్చిన మార్పులు, చేసిన అభివృద్ధి ఏంటనేది తెలంగాణ ప్రజలందరికీ తెలుసు అని కేటీఆర్ అన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి 11 నెలల పాలనలో ఏ ఒక్క మంచి నిర్ణయం తీసుకోలేదని ఫైర్ అయ్యారు. ‘హైడ్రా’ పేరుతో బ్లాక్‌మెయిల్ దందా మొదలు పెట్టారని సంచలన వ్యాఖ్యలు చేశారు. సాధారణ ప్రజలు ఇళ్ల నిర్మాణాలు, అనుమతుల కోసం ఎక్కడికి వెళ్లాలో.. ఎవరిని కలవాలో తెలియని పరిస్థితులు నెలకొన్నాయని ఆరోపించారు. ప్రభుత్వ అనాలోచిన నిర్ణయాలతో రాష్ట్ర ఆదాయం భారీగా పడిపోయిందని అన్నారు. ఢిల్లీ కి మూటలు పంపడం కోసం ఆగమాగం నిర్ణయాలు తీసుకుంటున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.