Monsoon : మే 27న కేరళను తాకనున్న నైరుతీ రుతుపవనాలు: ఐఎండీ
సాధారణంగా వర్షాకాలం జూన్ 1న కేరళలో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా జూలై 8 నాటికి ఈ రుతుపవనాలు విస్తరిస్తాయి. అనంతరం సెప్టెంబర్ 17 నుంచి ఈ రుతుపవనాల తిరోగమనం ప్రారంభమవుతుంది. అక్టోబర్ 15 నాటికి వర్షాకాలం పూర్తిగా ముగుస్తుంది.
- By Latha Suma Published Date - 02:09 PM, Sat - 10 May 25

Monsoon : ఈ ఏడాది వర్షాకాలం సాధారణం కన్నా ముందుగానే ప్రారంభం కానున్న సూచనలు కనిపిస్తున్నాయి. భారత వాతావరణ శాఖ తాజా నివేదిక ప్రకారం, నైరుతీ రుతుపవనాలు ఈ నెల 27వ తేదీన కేరళ తీరాన్ని తాకనున్నాయని వెల్లడించింది. ఐఎండీ గణాంకాల ప్రకారం, గతంలో 2009 సంవత్సరంలో మే 23న రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించాయి. సాధారణంగా వర్షాకాలం జూన్ 1న కేరళలో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా జూలై 8 నాటికి ఈ రుతుపవనాలు విస్తరిస్తాయి. అనంతరం సెప్టెంబర్ 17 నుంచి ఈ రుతుపవనాల తిరోగమనం ప్రారంభమవుతుంది. అక్టోబర్ 15 నాటికి వర్షాకాలం పూర్తిగా ముగుస్తుంది.
Read Also: PM Modi : త్రివిధ దళాల అధిపతులతో ప్రధాని హైలెవల్ మీటింగ్
ఈ సంవత్సరం వర్షపాతం పుష్కలంగా ఉండబోతున్నదని ఇప్పటికే ఏప్రిల్‌లో భారత వాతావరణ శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. సాధారణం కంటే అధిక వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టంగా తెలియజేసింది. ముఖ్యంగా ఈసారి ఎల్ నినో ప్రభావం కనిపించదని, దాంతో వర్షాలు మెరుగ్గా పడతాయని ‘ఎర్త్ సైన్సెస్’ శాఖ కార్యదర్శి ఎం. రవిచంద్రన్ తెలిపారు.
జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య నాలుగు నెలల పాటు వర్షపాతం సాధారణ స్థాయిని మించి ఉండే అవకాశముంది. ఇది వ్యవసాయ రంగానికి మంచి ఊతం ఇస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. వేసవి తీవ్రత ఇంకా కొనసాగుతుండగానే వర్షాకాలం ముందే రానుండటంతో, ప్రజలకు కొంత ఉపశమనం లభించనుంది. ఈ పరిణామాలు వ్యవసాయకారులకు, నీటి మూలాలు ఆధారపడిన రంగాలకు ఎంతో అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. వర్షాకాలం సమయానికి రావడం, మరింత ముందే రావడం దేశవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులపై ప్రభావం చూపుతుంది. ఇక, వానల కోసం ఎదురు చూసే రైతాంగానికి ఇది ఒక శుభవార్తగా చెప్పవచ్చు.
Read Also: TPCC : టీపీసీసీ కార్యవర్గానికి ఎంపికయ్యేది ఎవరు ? క్లారిటీ అప్పుడే !