32nd Time Contest : 32వసారి ఎన్నికల బరిలో ఉపాధిహామీ కూలీ
32nd Time Contest : ఎన్నికల్లో పోటీ చేయాలంటే.. కావాల్సింది ‘డబ్బు’ అనే విధంగా పరిస్థితులు మారిపోయాయి.
- By Pasha Published Date - 04:49 PM, Tue - 7 November 23

32nd Time Contest : ఎన్నికల్లో పోటీ చేయాలంటే.. కావాల్సింది ‘డబ్బు’ అనే విధంగా పరిస్థితులు మారిపోయాయి. ‘డబ్బు’ లేనిదే ఎన్నికల్లో పోటీ చేసేందుకు చాలామంది సాహసించరు. అలాంటిది రాజస్థాన్‌లోని గంగానగర్‌కు చెందిన 78 ఏళ్ల ఉపాధిహామీ కూలీ తీతర్ సింగ్ ఈదఫా 32వసారి ఎన్నికల బరిలోకి దూకారు. ఉపాధిహామీ కూలీ అంటే.. ఆయన ఆదాయం ఎంత తక్కువగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అయినా ఆయన ఎన్నికల్లో నామినేషన్ వేసేందుకు వెనుకాడలేదు. 1970వ సంవత్సరం నుంచి ఇప్పటిదాకా.. స్థానికంగా జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల నుంచి మొదలుకొని లోక్‌సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల దాకా ప్రతీదాంట్లోనూ తీతర్ సింగ్ నామినేషన్లు వేశారు. దీన్ని కంటిన్యూ చేస్తూ 32వసారి కూడా ఆయన మరో నామినేషన్ దాఖలు చేశారు. శ్రీ కరణ్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్ధిగా బరిలోకి దిగారు. అక్కడ నవంబరు 25న పోలింగ్ జరగనుంది. ప్రస్తుతం తీతర్ సింగ్ తన స్థోమతకు తగిన విధంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. పేదల బాధలను పేదలే అర్థం చేసుకోగలుగుతారని ఓటర్లకు వివరిస్తున్నారు. ‘‘నేను 5వతరగతి వరకే చదువుకున్నాను. అయినా సంతకం చేయగలను. నాకు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 653 ఓట్లు, 2013 అసెంబ్లీ ఎన్నికల్లో 427, 2008 రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో 938 ఓట్లు వచ్చాయి’’ అని తీతర్‌సింగ్ వివరించారు.
We’re now on WhatsApp. Click to Join.
ప్రశ్న : 1970 నుంచి వరుసగా ఎన్నికల్లో ఓడిపోతున్నా పోటీ చేసేలా మిమ్మల్ని ప్రేరేపిస్తున్నది ఏమిటి?
తీతర్ సింగ్ : నేను ఎన్నికల్లో పోటీ చేయడం ఇది 32వ సారి. నా నాలుగు తరాలు గడిచిపోయినా మా కుటుంబాల జీవితాలు మారలేదు. బీజేపీ, కాంగ్రెస్‌లు అధికారంలోకి వచ్చినా, పోయినా పేదలకు లాభం జరగలేదు. గ్రామాలు డెవలప్ కాలేదు. పేద ప్రజలకు ప్రభుత్వం భూమి పంచాలి. వారి జీవితాలు మారేలా పథకాలు అమలు చేయాలి. ఈ ఆలోచనలే నన్ను ఎన్నికల్లో పోటీ చేసేలా ప్రేరేపిస్తున్నాయి.
ప్రశ్న: మీరు ఈసారి ఎన్నికైతే ఏం చేస్తారు ?
తీతర్ సింగ్ : నేను ఈసారి ఎమ్మెల్యేగా ఎన్నికైతే నియోజకవర్గంలోని గ్రామాలలో రోడ్లను బాగు చేయిస్తాను. ప్రజలకు అవసరమైన అన్ని అభివృద్ధి పనులు చేయిస్తాను.భూమిలేని పేద కూలీలకు భూమిని(32nd Time Contest) పంచుతాను.