V Narayanan : స్పేస్ స్టేషన్ ఏర్పాటుకు ప్రధాని అనుమతి: ఇస్రో చీఫ్
గతంలో అనేక మంది గొప్ప నేతలు దీన్ని నడిపించారని, ఈ సంస్థలో భాగస్వామ్యం కావడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. తన నియామకం గురించి తొలుత ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి ఫోన్ వచ్చినట్లు వీ నారాయణన్ చెప్పారు.
- By Latha Suma Published Date - 04:26 PM, Wed - 8 January 25

V Narayanan : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) కొత్త ఛైర్మన్‌గా ఎస్ వి.నారాయణన్‌ను నియమించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సంతోషం వ్యక్తం చేశారు. ఎంతో మంది గొప్ప శాస్త్రవేత్తల నాయకత్వంలో సంస్థ కీర్తిగాంచిందని, అలాంటి సంస్థలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇస్రో చాలా గొప్ప సంస్థ అని, గతంలో అనేక మంది గొప్ప నేతలు దీన్ని నడిపించారని, ఈ సంస్థలో భాగస్వామ్యం కావడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. తన నియామకం గురించి తొలుత ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి ఫోన్ వచ్చినట్లు వీ నారాయణన్ చెప్పారు. ప్రధానియే అన్నీ డిసైడ్ చేస్తున్నారని, పీఎంవో తనను కాంటాక్ట్ అయ్యిందని, ప్రస్తుతం ఇస్రో చైర్మెన్ ఎస్ సోమనాథ్ కూడా తనకు ఫోన్ కాల్ చేశారని, కొత్త అపాయింట్మెంట్ గురించి చెప్పినట్లు ఆయన వెల్లడించారు.
ఇస్రో చాలా విజయవంతమైన దశలో ఉన్నదని, చంద్రయాన్-4తో పాటు గగన్‌యాన్ మిషన్లు తమ ముందు ఉన్నట్లు ఆయన తెలిపారు. చేపట్టబోయే ప్రాజెక్టుల గురించి వివరిస్తూ.. స్పేడెక్స్ మిషన్‌ను డిసెంబర్ 30వ తేదీన చేపట్టామని, జనవరి 9వ తేదీన స్పేడెక్స్ శాటిలైట్ల డాకింగ్ జరగనున్నట్లు ఆయన తెలిపారు. గగన్‌యాన్ కూడా ఇస్రో ముందున్న అతిపెద్ద ప్రోగ్రామ్ అని పేర్కొన్నారు. ఇస్రో మాక్ 3 వెహికిల్ ద్వారా అమెరికాకు చెందిన కమర్షియల్ శాటిలైట్‌ను కూడా ప్రయోగించనున్నారు. గగన్‌యాన్ రాకెట్ అసెంబ్లింగ్‌కు చెందిన పనులు కూడా శ్రీహరికోట్లో ప్రోగ్రెస్ అవుతున్నాయి. చంద్రయాన్3 ద్వారా చంద్రుడి దక్షిణ ద్రువంపై ల్యాండ్ అయిన విషయం అందరికీ తెలిసిందే అన్నారు. క్రూ లేకుండా మాడ్యూల్‌ను ప్రయోగించే దాని కోసం ఇస్రోలో పనులు జరుగుతున్నాయన్నారు. జీఎస్ఎల్వీ ద్వారా ఎన్వీఎస్ 02 నావిగేషన్ శాటిలైట్ను పంపేందుకు శ్రీహరికోటలో వర్క్ జరుగుతోందన్నారు.
స్పేస్ స్టేషన్ నిర్మాణం కోసం ప్రధాని మోడీ అనుమతి కూడా తమకు దక్కిందన్నారు. స్పేస్ స్టేషన్‌కు అయిదు మాడ్యూళ్లు ఉంటాయని, 2028లో స్పేస్ స్టేషన్‌కు తొలి మాడ్యూల్‌ను లాంచ్ చేసే రీతిలో అనుమతి దక్కిందన్నారు. చంద్రయాన్ 4 ద్వారా ఆ ప్రదేశంలో చంద్రుడిపై ల్యాండ్ అయి, శ్యాంపిళ్లు సేకరించిన తర్వాత మళ్లీ తిరిగి వచ్చే రీతిలో పనులు జరుగుతున్నాయన్నారు. భారత స్పేస్ స్టేషన్‌ని సెటప్ చేసేందుకు ప్లాన్ జరుగుతోందన్నారు.