KTR : రోడ్డెక్కి కానిస్టేబుల్ భార్యలు..సంఘీభావం తెలిపిన కేటీఆర్
KTR : సాధ్యమైనంత త్వరగా కానిస్టేబుళ్ల సమస్యలను తీర్చాలని సూచించారు. లేదంటే బీఆర్ఎస్ పార్టీ పక్షాన నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తామని చెప్పారు.
- By Latha Suma Published Date - 12:40 PM, Thu - 24 October 24

Ditch Pally Battalion: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిచ్ పల్లి బెటాలియన్ ముందు ధర్నా చేస్తున్న కానిస్టేబుళ్ల భార్యలు, కుటుంబ సభ్యులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ వారి సమస్యను విన్నారు. అనంతరం బెటాలియన్ పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడారు. సాధ్యమైనంత త్వరగా కానిస్టేబుళ్ల సమస్యలను తీర్చాలని సూచించారు. లేదంటే బీఆర్ఎస్ పార్టీ పక్షాన నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా మహిళలు వి వాంట్ జస్టిస్ అంటూ నినదించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అనవసరంగా అధికారంలోకి తీసుకొచ్చామని దుమ్మెత్తిపోశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమను బలవంతంగా అరెస్టు చేసి, తమ భర్తలను విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నారంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా, తెలంగాణ రాష్ట్రంలో ఆయా బెటాలియన్లలో పని చేస్తున్న పోలీసు కానిస్టేబుళ్ల కుటుంబాల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. మొన్న నల్లగొండ, నిన్న వరంగల్, ఈరోజు సిరిసిల్ల, డిచ్‌పల్లి బెటాలియన్ల వద్ద కానిస్టేబుళ్ల భార్యలు, కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. తమ భర్తలు ఎదుర్కొంటున్న సమస్యలపై భార్యలు గళమెత్తారు. వన్ పోలీసింగ్ విధానాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలోని ఏడో బెటాలియన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ భార్యలు రోడ్డెక్కి నిరసన చేపట్టారు. జాతీయ రహదారి 44పై వారు నిరసన తెలిపారు. తమ భర్తల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వారంతా డిమాండ్ చేశారు.