KTR : కౌశిక్ రెడ్డి ఘటన పై స్పందించిన కేటీఆర్
KTR : అరికెపూడి గాంధీతో అతడిపై దాడి చేసే ప్రయత్నం చేశారు. ప్రజల కోసం పోరాడుతున్న ఎమ్మెల్యేపై సీఎం దాడి చేయించారు. ఇంత పిరికి ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదు.
- By Latha Suma Published Date - 05:18 PM, Sat - 9 November 24

Kaushik Reddy : హుజురాబాద్‌లో దళిత బంధు లబ్దిదారుల పక్షాన ధర్నాకు దిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. దళిత బంధు పథకం రెండో విడత నిధులు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా లబ్దిదారులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. పలువురికి గాయాలు అయ్యాయి. ఎమ్మెల్యేతో సహా పలువురిని ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ ఘటపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. నిధులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఎమ్మెల్యేపై దాడి చేయడమేనా ఇందిరమ్మ రాజ్యమంటే? అని మండిపడ్డారు.
ప్రభుత్వ పెద్దల మెప్పు పొందేందుకు రాష్ట్రంలో పోలీసులు పనిచేస్తున్నారని, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక తప్పకుండా పోలీసులకు వడ్డీతో చెల్లిస్తాం అని కేటీఆర్ హెచ్చరించారు. అరికెపూడి గాంధీతో అతడిపై దాడి చేసే ప్రయత్నం చేశారు. ప్రజల కోసం పోరాడుతున్న ఎమ్మెల్యేపై సీఎం దాడి చేయించారు. ఇంత పిరికి ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదు. కౌశిక్ రెడ్డిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. అరెస్టు చేసిన బీఆర్‌ఎస్ కార్యకర్తలందర్నీ విడుదల చేయాలి అని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇలాంటి తాటాకు చప్పుళ్లకు బీఆర్ఎస్ సైనికులెవరు భయపడారు అని తేల్చిచెప్పారు.
మరోవైపు మాజీ మంత్రి హరీశ్ రావు హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డికి ఫోన్ చేశారు. ఘటన జరిగిన తీరు, ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఆందోళన చెందవద్దని, పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. న్యాయపరంగా ముందుకెళ్దామని సూచించారు. దళిత బంధు నిధుల విడుదలపై లబ్దిదారులతో కలిసి నిరసన తెలిపితే తనపై దాడికి యత్నించారని హరీష్ రావుకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తెలిపారు.