Battalion Police : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెక్యూరిటీలో కీలక మార్పులు..
Battalion Police : గతకొన్ని రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా బెటాలియన్ పోలీసులు ఆందోళనలు చేస్తున్నారు. కర్నాటక, తమిళనాడు తరహాలో తెలంగాణలో కూడా ఒకే పోలీస్ విధానం అమలు చేయాలని ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు.
- By Latha Suma Published Date - 04:43 PM, Mon - 28 October 24

Telangana Police Department: రాష్ట్రవ్యాప్తంగా బెటాలియన్ పోలీసుల ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తెలంగాణ పోలీస్ శాఖ అప్రమత్తమైంది. హైదరాబాద్‌లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసం వద్ద భద్రత సిబ్బందిని మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు సీఎం ఇంటివద్ద విధులు నిర్వహించిన బెటాలియన్ పోలీస్ సిబ్బందిని సీఎం సెక్యూరిటీ వింగ్ మార్చింది. ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసులను నియమించారు. ఈ మార్పులను సోమవారం నుంచే అమలు చేశారు.
కాగా, గతకొన్ని రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా బెటాలియన్ పోలీసులు ఆందోళనలు చేస్తున్నారు. కర్నాటక, తమిళనాడు తరహాలో తెలంగాణలో కూడా ఒకే పోలీస్ విధానం అమలు చేయాలని ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. ఇప్పటికే సెలవుల విషయంలో వెనక్కి తగ్గినట్లు పోలీస్ శాఖ ప్రకటన విడుదల చేసినా ఆందోళనలు ఆగడం లేదు. దీంతో సీఎ రేవంత్ ఇంటివద్ద విధులు నిర్వహిస్తున్న బెటాలియన్ పోలీసులను మారుస్తూ డిపార్ట్‌మెట్ కీలక నిర్ణయం తీసుకుంది.
మరోవైపు నిరసనలు చేస్తూ నిబంధలకు విరుద్ధంగా వ్యవహరించారంటూ క్రమశిక్షణా చర్యల పేరుతో 39 మంది హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లను శనివారం నాడు పోలీస్ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఆదివారం నాడు ఏఆర్ ఎస్సై, మరో హెడ్ కానిస్టేబుల్ సహా ఏకంగా 10 మందిని ఉద్యోగాల నుంచి శాశ్వతంగా తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయినప్పటికీ వీరి ఆందోళనలు మాత్రం ఆగడం లేదు. తమకు వెట్టిచాకిరీ నుంచి విముక్తి కల్పించాలని బెటాలియన్ పోలీసులు ఆందోళనలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి నివాసం వద్ద ఆర్మ్‌డ్ రిజర్వు పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.