Farmers: సూది నుంచి సుత్తి దాకా.. అన్నీ తెచ్చుకుంటున్నాం.. పంజాబ్ రైతులు
- Author : Latha Suma
Date : 13-02-2024 - 1:35 IST
Published By : Hashtagu Telugu Desk
punjab-farmers: కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించాలంటూ రైతు సంఘాలు చేపట్టిన చలో ఢిల్లీ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. రైతులు పార్లమెంట్ ముట్టడికి పిలుపునివ్వడంతో కేంద్రం ప్రభుత్వం అప్రమత్తమైంది. ఢిల్లీకి రైతులు చేరుకోకుండా బార్డర్లలోనే ఆపేసేందుకు అన్ని చర్యలు చేపట్టింది. సరిహద్దులు మూసేయడంతో పాటు రోడ్లపై బారికేడ్లు, సిమెంట్ దిమ్మెలు, కంటైనర్లతో గోడలు కట్టింది. రోడ్డుకు అడ్డంగా ఇనుప మేకులు బిగించింది. పెద్ద సంఖ్యలో భద్రతా బలగాలను మోహరించింది. అయితే, ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అడ్డంకులేవీ తమను ఆపలేవని రైతులు అంటున్నారు. ఆరు నెలల పాటు ఉండేందుకు సిద్దపడే వస్తున్నామని, అందుకు అవసరమైన సరుకులను వెంట తెచ్చుకుంటున్నామని పంజాబ్ కు చెందిన ఓ రైతు మీడియాకు వెల్లడించాడు.
2020 లో రైతు సంఘాల పిలుపుతో ఢిల్లీ బార్డర్ కు చేరుకున్న రైతులు దాదాపు 13 నెలల పాటు అక్కడే ఆందోళనలు చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో వారితో పలుమార్లు చర్చలు జరిపిన కేంద్రం.. రైతుల ప్రధాన డిమాండ్లకు అంగీకరించింది. అయితే, అప్పట్లో కేంద్రం హామీ ఇచ్చిన వాటిలో ఇంకా చాలా హామీలు అమలు కాలేదని రైతులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించే విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించడంలేదని ఆరోపించారు. ఈ క్రమంలోనే మరోమారు ఆందోళనకు సిద్దమైనట్లు రైతు సంఘాల నేతలు వివరించారు.
We’re now on WhatsApp. Click to Join.
సూది నుంచి సుత్తి దాకా.. ఇంట్లోకి అవసరమయ్యే ప్రతీ ఒక్కటీ మా ట్రాలీలో ఉంది. రాళ్లను బద్దలు కొట్టేందుకు అవసరమైన పనిముట్లు కూడా వెంట తెచ్చుకుంటున్నాం. ఆరు నెలలకు సరిపడా తిండి గింజలు, ఇతర సామాగ్రితోనే ఇంట్లో నుంచి బయట అడుగు పెట్టాం. డీజిల్ కూడా ట్రాలీలలో నింపుకుని బయలుదేరాం. మాకోసమే కాదు హర్యానా రైతు సోదరులకు సరిపడా డీజిల్ కూడా తీసుకొస్తున్నాం. ఈసారి మా డిమాండ్లు పూర్తిగా నెరవేరేదాకా వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదు. అందుకు సిద్ధపడే వస్తున్నాం.. అంటూ పంజాబ్ లోని గురుదాస్ పూర్ కు చెందిన రైతు హర్భజన్ సింగ్ మీడియాకు చెప్పారు. ఢిల్లీకి వెళ్లే హైవేపై ట్రాక్టర్ నడుపుతూ మీడియా ప్రతినిధితో ఆయన మాట్లాడారు. ఆయన నడుపుతున్న ట్రాక్టర్ కు రెండు ట్రాలీలు అటాచ్ చేసి ఉన్నాయి. ఒకదాంట్లో మనుషులు ఉండేందుకు ఏర్పాట్లు ఉండగా.. మరోదాంట్లో డీజీల్ ఉందని హర్భజన్ చెప్పారు.
read also : Nara-lokesh : లక్ష కోట్ల అవినీతికి పాల్పడిన జగన్ జైలుకు వెళ్లే రోజు దగ్గర్లోనే ఉందిః లోకేశ్