Nitin Gadkari : మూడు జిల్లాలకు జాతీయ రహదారితో కనెక్టివిటీ : కేంద్ర మంత్రి గడ్కరీ
‘రాష్ట్రాల మధ్య అనుసంధానం పెంపొందించేందుకు కేంద్రం కీలక ప్రాజెక్టులను చేపడుతోంది. క్లిష్ట భౌగోళిక ప్రాంతాల్లో సొరంగాలు, వంతెనల నిర్మాణాలను ప్రారంభించాం. జోజిలా పాస్ టన్నెల్ మాదిరిగా సాంకేతికంగా సవాలుతో కూడిన నిర్మాణాలను విజయవంతంగా అమలు చేస్తున్నాం.
- By Latha Suma Published Date - 02:02 PM, Mon - 5 May 25

Nitin Gadkari : కేంద్ర రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొని రూ.3,900 కోట్ల విలువైన జాతీయ రహదారి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గడ్కరీ మాట్లాడుతూ..ఆదిలాబాద్ జిల్లాకు ఓ ప్రత్యేక చరిత్ర ఉందని పేర్కొన్నారు. ఆదివాసీలు భూమి కోసం, భుక్తి కోసం చేసిన పోరాటాల క్షేత్రంగా ఈ జిల్లా గుర్తింపును పొందిందని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం పీఎం సడక్ యోజన కింద దేశవ్యాప్తంగా రోడ్లు నిర్మిస్తున్నదని తెలిపారు. ఒక దేశ అభివృద్ధికి రహదారులు కీలకమని పేర్కొంటూ, వ్యవసాయం, ఉపాధి, రవాణా, మౌలిక వసతుల అభివృద్ధి నాలుగు అంశాలే దేశ పురోగతికి బలమైన మూలస్తంభాలని చెప్పారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
Read Also: Prakash Raj : భయంలో బాలీవుడ్ యాక్టర్స్.. ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు
‘‘రాష్ట్రాల మధ్య అనుసంధానం పెంపొందించేందుకు కేంద్రం కీలక ప్రాజెక్టులను చేపడుతోంది. క్లిష్ట భౌగోళిక ప్రాంతాల్లో సొరంగాలు, వంతెనల నిర్మాణాలను ప్రారంభించాం. జోజిలా పాస్ టన్నెల్ మాదిరిగా సాంకేతికంగా సవాలుతో కూడిన నిర్మాణాలను విజయవంతంగా అమలు చేస్తున్నాం. సూర్యాపేట నుంచి దేవరపల్లి వరకు గ్రీన్‌ఫీల్డ్ రహదారి నిర్మాణం జరగనుంది. అలాగే, నాగ్‌పూర్ నుంచి విజయవాడ వరకు కారిడార్ కూడా సిద్ధమవుతోంది. ఇది తెలంగాణ-మహారాష్ట్ర మధ్య రవాణాను గణనీయంగా మెరుగుపరుస్తుంది’’ అని తెలిపారు.
భద్రాచలం, బాసర, మేడారం వంటి ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలను జాతీయ రహదారులతో అనుసంధించనున్నట్లు ఆయన వెల్లడించారు. జగిత్యాల-కరీంనగర్ హైవే విస్తరణ పనులను త్వరలో ప్రారంభించనున్నట్టు చెప్పారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ను తగ్గించేందుకు చేపట్టిన పలు ప్రాజెక్టుల్లో భాగంగా అంబర్‌పేట్‌లో నిర్మించిన పైవంతెనను అదే రోజు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇంధన ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు విద్యుత్, సీఎన్‌జీ వాహనాలను ప్రోత్సహిస్తున్నామని, పెట్రోల్ వాహనాలకు బదులుగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇది రవాణా ఖర్చు తగ్గించడమే కాక, కాలుష్య నియంత్రణలో కూడా కీలకంగా పనిచేస్తుందన్నారు.