AP Govt : ఏపీ ఎక్సైజ్ శాఖలో ‘సెబ్’ రద్దు..డీజీపీ ఉత్తర్వులు
AP Govt Dissolved Special Enforcement Bureau : ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (సెబ్)ను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి కేటాయించిన 4,393 మంది (70 శాతం) ఎక్సైజ్ సిబ్బందిని తిరిగి మాతృ శాఖలోకి తీసుకురానున్నారు.
- By Latha Suma Published Date - 06:49 PM, Wed - 11 September 24

AP Govt Dissolved Special Enforcement Bureau : ఏపీలో గత వైసీపీ హయాంలో ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (సెబ్)ను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి కేటాయించిన 4,393 మంది (70 శాతం) ఎక్సైజ్ సిబ్బందిని తిరిగి మాతృ శాఖలోకి తీసుకురానున్నారు. సెబ్ ఏర్పాటు కాక మునుపు ఎక్సైజ్‌శాఖ స్వరూపం ఎలా ఉండేదో అదే తరహా వ్యవస్థను మళ్లీ పునరుద్ధరించనున్నారు. సెబ్ రద్దుకు మంత్రివర్గం ఇప్పటికే ఆమోదం తెలిపిన నేపథ్యంలో దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులను డీజీపీ ద్వారకా తిరుమలరావు ఈరోజు విడుదల చేశారు. సెబ్ ఏర్పాటు చేయడానికి ఎక్సైజ్ శాఖలో ఉన్న 6,274 మందిలో 1,881 (30 శాతం) మందిని మాత్రమే ఎక్సైజ్‌లో ఉంచి.. మిగతా వారందరినీ సెబ్‌కు కేటాయించారు. ఇప్పుడు వారిని మళ్లీ ఎక్సైజ్‌లోకి తీసుకురానున్నారు. వీరంతా ఎక్సైజ్ కమిషనర్ నియంత్రణ, పర్యవేక్షణలో పనిచేస్తారు. ఐజీ ర్యాంకు కలిగిన ఐపీఎస్ అధికారి నేతృత్వంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం ఏర్పాటుకానుంది.
అక్రమ రవాణా నియంత్రణ లక్ష్యంతో ఏర్పాటైన సెబ్..
కాగా, 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్, పోలీస్ శాఖల నుంచి సిబ్బందిని కలిపి స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరోను ఏర్పాటు చేశారు. మొదట్లో మద్యం అక్రమ రవాణా నియంత్రణ, నాటు సారా తయారీ నిరోధం, గంజాయి సాగు, రవాణాలను కట్టడి చేసే లక్ష్యంతో ఏర్పాటైన సెబ్‌ను తర్వాత ఇసుక, మట్టి అక్రమ తవ్వకాలు, రవాణాలకు కూడా విస్తరించారు. 2021 కోవిడ్ సెకండ్ వేవ్ వరకు సెబ్ పెట్టిన కేసులతో వేలాది మంది కేసుల పాలయ్యారు. ఆంధ్రాలో మద్యం ధరలు భారీగా పెంచడంతో ఏపీ నుంచి తెలంగాణ జిల్లాలకు వెళ్లి మద్యాన్ని కొనుగోలు చేసేవారు. ఏపీలోని కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు అటు రాయలసీమలో కూడా వేలాది మంది మద్యం కోసమే పొరుగు రాష్ట్రాలకు వెళ్లేవారు. రైళ్లు, బస్సులు, ద్విచక్ర వాహనాల్లో పెద్ద ఎత్తున మద్యం తరలించే వారు. వ్యక్తిగత వినియోగంతో పాటు బెల్టు షాపుల్లో విక్రయం కోసం ఇలా జిల్లాలు దాటే వారు. సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన సెబ్ చెక్‌పోస్టుల్లో పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపారు.
గత ప్రభుత్వ హయాంలో సెబ్ కోసం 4 వేలకుపైగా సిబ్బందిని సెబ్ కు కేటాయించారు. మిగతా వారిని ఎక్సైజ్ శాఖలోనే ఉంచారు. ఇప్పుడు సెబ్ రద్దు కావటంతో… గతంలో ఉన్న మాదిరిగానే ఎక్సైజ్ వ్యవస్థ ఉండనుంది. సెబ్ సిబ్బంది అంతా కూడా పాత విధానంలోనే పని చేయనుంది. వీరంతా ఎక్సైజ్ కమిషనర్ నియంత్రణ, పర్యవేక్షణలో పనిచేస్తారు.
Read Also: IPL Auction 2025: ఐపీఎల్ మెగా వేలంపై ఉత్కంఠ