PM Modi : శ్రీలంక అధ్యక్షుడు, ప్రధాని మోడీ మధ్య ధ్వైపాక్షిక చర్చలు
తమిళ జాలర్లను వెంటనే విడుదల చేయాలని, వారి పడవలను విడిచిపెట్టాలని ప్రధాని కోరారు. రెండు దేశాల మధ్య ఏన్నో ఏళ్లుగా ఈ అంశం నలుగుతోంది. దానికి పరిష్కారం చూపే దిశగా తాజా పర్యటనలో చర్చలు జరిగాయి. ఇక రెండు దేశాల మధ్య కీలక రక్షణ ఒప్పందం కుదిరింది.
- By Latha Suma Published Date - 02:39 PM, Sat - 5 April 25

PM Modi : ప్రధాని మోడీ మూడురోజుల పర్యటనలో భాగంగా శ్రీలంకలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే శ్రీలంక అధ్యక్షుడు దిసనాయకే, ప్రధాని మోడీ మధ్య ధ్వైపాక్షిక చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా తమిళ జాలర్ల అంశం ప్రస్తావనకొచ్చింది. తమిళ జాలర్లను వెంటనే విడుదల చేయాలని, వారి పడవలను విడిచిపెట్టాలని ప్రధాని కోరారు. రెండు దేశాల మధ్య ఏన్నో ఏళ్లుగా ఈ అంశం నలుగుతోంది. దానికి పరిష్కారం చూపే దిశగా తాజా పర్యటనలో చర్చలు జరిగాయి. ఇక రెండు దేశాల మధ్య కీలక రక్షణ ఒప్పందం కుదిరింది. ఈ మేరకు సంతకాలు జరిగాయి. ట్రింకోమలీని ఇంధన కేంద్రంగా అభివృద్ధి చేయడం, శ్రీలంక తూర్పు ప్రాంతానికి భారత్ గ్రాంట్ అందించడం వంటి ఒప్పందాలు జరిగాయి.
Read Also: Naga Babu : పిఠాపురంలో ఎమ్మెల్సీ నాగబాబుకు నిరసన సెగ
ద్వైపాక్షిక చర్చల అనంతరం ప్రధాని మోడీ మాట్లాడుతూ.. భారత ప్రయోజనాల విషయంలో అధ్యక్షుడు సానుకూలంగా స్పందిస్తున్నందుకు కృతజ్ఞతలు అని తెలిపారు. భారత ప్రయోజనాలకు విరుద్ధంగా శ్రీలంక భూభాగాన్ని వినియోగించనివ్వబోమని ఆ దేశాధ్యక్షుడు వెల్లడించారు. క్లిష్ట సమయాల్లో న్యూదిల్లీ అందిస్తోన్న సహకారం ఎంతో విలువైనది అని పేర్కొన్నారు. ‘2019లో జరిగిన ఉగ్రదాడి, కొవిడ్ మహమ్మారి, ఇటీవలి ఆర్థిక సంక్షోభం.. ఎలాంటి క్లిష్టసమయంలో అయినా భారత్ శ్రీలంక వెంట ఉంది. రెండు దేశాల భద్రతా ప్రయోజనాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. ఈ దిశగా జరిగిన రక్షణ సహకారం ఒప్పందాన్ని స్వాగతిస్తున్నాం. మత్స్యకారుల సమస్యపై మానవతా దృక్పథంతో వ్యవహరించాలని అంగీకారానికి వచ్చాం. శ్రీలంక ప్రభుత్వం తమిళ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తుందని ఆశిస్తున్నాం అన్నారు. అలాగే ఇద్దరు నేతలు సాంపూర్ సౌర విద్యుత్ ప్రాజెక్టును వర్చువల్‌గా ప్రారంభించారు.
మరోవైపు శ్రీలంక ప్రభుత్వం అత్యున్నత పురస్కారాన్ని ప్రధాని మోడీకి ప్రదానం చేసింది. ద్వీపదేశ అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే ‘శ్రీలంక మిత్ర విభూషణ’ పురస్కారాన్ని అందజేశారు.కాగా, థాయ్‌లాండ్‌లో బిమ్‌స్టెక్ సదస్సు ముగిసిన అనంతరం శుక్రవారం సాయంత్రం ప్రధాని మోడీ నేరుగా అక్కడకు చేరకున్నారు. బండారునాయకే ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో దిగిన ఆయనను లంక ప్రభుత్వం ఘనంగా స్వాగతించింది. శనివారం ఉదయం ఇండిపెండెన్స్ స్క్వేర్ వద్ద అధ్యక్షుడు సంప్రదాయ పద్ధతుల్లో ఆహ్వానం పలికారు. ఇరుదేశాల మధ్య ఉన్న చరిత్రాత్మక సంబంధాలకు ప్రతీకగా ఈ స్వాగతం నిలిచింది.