Dissanayake : శ్రీలంక నూతన అధ్యక్షుడిగా అనురా కుమార్ దిసనాయకే ప్రమాణ స్వీకారం
Sri Lanka : ఈ మేరకు రాష్ట్రపతి సచివాలయంలో ప్రధాన న్యాయమూర్తి జయంత జయసూర్య ఆయనతో ప్రమాణం చేయించారు. దేశానికి అధ్యక్షుడైన తొలి లెఫ్ట్ పార్టీ నేతగా ఆయన రికార్డులకెక్కారు.
- Author : Latha Suma
Date : 23-09-2024 - 12:31 IST
Published By : Hashtagu Telugu Desk
Sri Lanka New President : శ్రీలంక నూతన అధ్యక్షుడిగా జనతా విముక్తి పెరమున (జేవీపీ) పార్టీ నేత, వామపక్ష నాయకుడు అనురా కుమార్ దిసనాయకే(55) ప్రమాణస్వీకారం చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి సచివాలయంలో ప్రధాన న్యాయమూర్తి జయంత జయసూర్య ఆయనతో ప్రమాణం చేయించారు. దేశానికి అధ్యక్షుడైన తొలి లెఫ్ట్ పార్టీ నేతగా ఆయన రికార్డులకెక్కారు.
Read Also: Gandhi Hospital Deaths: గాంధీ ఆసుపత్రిలో శిశు మరణాలపై త్రిసభ్య కమిటీ: కేటీఆర్
కాగా, శ్రీలంకకు అనురాకుమార్ దిసనాయకే తొమ్మిదో అధ్యక్షుడు. గత ఎన్నికల్లో కేవలం మూడు శాతం ఓట్లు మాత్రమే సాధించిన ఆయన.. ఈ ఎన్నికల్లో మార్పు, అవినీతి వ్యతిరేక సమాజ నిర్మాణం వంటి నినాదాలతో విస్తృతంగా ప్రచారం చేసి అపూర్వ జనాదరణ పొందారు. ఎన్నికల ప్రసంగాల్లో గత పాలకుల అవినీతి, వైఫల్యాలను ఎత్తిచూపుతూనే.. జవాబుదారీతనం ప్రాముఖ్యతను ప్రజలకు వివరించారు. శ్రీలంక ఆర్థిక సంక్షోభం, రాజపక్సే రాజీనామా వంటి పరిణామాలతో ఏర్పడిన నాయకత్వ శూన్యత, ప్రజల్లో నిరుత్సాహం కమ్ముకొని ఉన్న పరిస్థితుల్లో వ్యవస్థలో మార్పు రావాలని కోరుకుంటున్న యువతను.. అవినీతి వ్యతిరేక వైఖరితో ఆకట్టుకున్నారు. ఆవిధంగా అవినీతిపై పోరాటమే ప్రచార అస్త్రంగా చేసుకొని 42.31 శాతం ఓట్లు సాధించి, సమీప ప్రత్యర్థి సాజిత్ ప్రేమదాస సమగి జన బలవేగయ (ఎస్జెబి)పై సంచలన విజయం సాధించారు.
శ్రీలంకలో మొన్న అధ్యక్ష ఎన్నికలు జరగ్గా అదే రోజు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు తర్వాత దిస్సనాయకే, సమగి జన సంధానయ అభ్యర్థి సజిత్ ప్రేమదాస ఇద్దరూ గెలుపునకు అవసరమైన ఓట్లను పొందడంలో విఫలమయ్యారు. దీంతో రెండో ప్రాధాన్య ఓట్లను లెక్కించడంతో దిస్సనాయకే విజయం ఖరారైంది.