Terrorists : జమ్మూ కాశ్మీర్‌లో 56 మంది విదేశీ ఉగ్రవాదులు..భద్రతా సంస్థలు వెల్లడి!
పహల్గాం ఉగ్రదాడికి తమదే బాధ్యత అని లష్కరే తోయిబా అనుబంధ విభాగం 'ద రెసిస్టెన్స్ ఫ్రంట్' వెల్లడించింది. వారిలో 18 మంది జైషే మహమ్మద్, 35 మంది లష్కరే ముఠాలకు చెందినవారని వాటిని బట్టి తెలుస్తోంది. ముగ్గురికి హిజ్బుల్ ముజాహిద్దీన్‌తో సంబంధం ఉందని, వారు కూడా పాకిస్థాన్‌కు చెందినవారని భద్రతా సంస్థలకు చెందిన అధికారి ఒకరు వెల్లడించారు.
- By Latha Suma Published Date - 04:36 PM, Wed - 23 April 25

Terrorists : జమ్మూకశ్మీర్‌లో 56 మంది విదేశీ ఉగ్రవాదులు ఉన్నట్లు తాజాగా భద్రత సంస్థలు వెల్లడించాయి. వారిలో అత్యధికంగా లష్కరే తోయిబా ముఠా సభ్యులు ఉన్నట్లు భద్రతా దళాలు నిర్వహిస్తున్న రికార్డుల ఆధారంగా బయటపడిందని పేర్కొన్నారు. అయితే తాజాగా పహల్గాం ఉగ్రదాడికి తమదే బాధ్యత అని లష్కరే తోయిబా అనుబంధ విభాగం ‘ద రెసిస్టెన్స్ ఫ్రంట్’ వెల్లడించింది. వారిలో 18 మంది జైషే మహమ్మద్, 35 మంది లష్కరే ముఠాలకు చెందినవారని వాటిని బట్టి తెలుస్తోంది. ముగ్గురికి హిజ్బుల్ ముజాహిద్దీన్‌తో సంబంధం ఉందని, వారు కూడా పాకిస్థాన్‌కు చెందినవారని భద్రతా సంస్థలకు చెందిన అధికారి ఒకరు వెల్లడించారు.
Read Also: India Vs Pak : భారత ఆర్మీ ప్రత్యేక ఆపరేషన్.. కీలక ప్రకటన ?
వీరితో పాటు కేవలం 17 మంది మాత్రమే స్థానిక ఉగ్రవాదులు ఉన్నారని, వారి సంఖ్య విదేశీ ఉగ్రవాదులతో పోలిస్తే చాలా తక్కువని తెలిపాయి. ఈ విదేశీ ఉగ్రవాదుల సంఖ్య ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని అన్నారు. కశ్మీర్‌లో కొంతకాలం నుంచి పర్యాటకుల తాకిడి పెరిగిన నేపథ్యంలో ఉగ్రవాదులు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు భద్రతా దళాలు భావిస్తున్నాయి. సైనికుల దుస్తుల్లో వచ్చిన ఉగ్రమూకలు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని తెలుస్తోంది. కాల్పుల అనంతరం సమీప అడవుల్లోకి పారిపోవడంతో భద్రతా సిబ్బంది గాలిస్తున్నారు.
కశ్మీర్‌లో అశాంతిని రెచ్చగొట్టడానికీ పాకిస్థాన్ నుంచి చొరబాట్లను పెంచడానికీ, ఇది స్పష్టమైన సంకేతమని భద్రతా అధికారులు అంటున్నారు. పహల్గాం వంటి దాడులు ఈ విదేశీ ముష్కరుల పనేనని, వారి ఉనికి కశ్మీర్ లోయలో శాంతి స్థాపనకు పెనుసవాలుగా మారిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించేంత వరకు భద్రతా బలగాల పోరాటం కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు. పర్యాటకులపై జరిగిన ఈ దాడి కశ్మీర్‌లో ఉగ్రవాద నిరోధక చర్యలను మరింత ముమ్మరం చేయాల్సిన అవసరాన్ని మరోసారి తెలియజేసింది.
కాగా, మినీ స్విట్జర్లాండ్‌గా పిలువబడే పహల్గాం సమీపంలోని బైసరన్ లోయ మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో రక్తసిక్తమైంది. ఈ పాశవిక దాడిలో 26 మంది అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఊహించని ఈ దాడితో పర్యాటకులు, స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఘటన నేపథ్యంలో ఎన్‌ఐఏ రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టింది. మరోవైపు ఉగ్రదాడి దృష్ట్యా ఢిల్లీలోనూ భద్రతను కట్టుదిట్టం చేశారు.
Read Also: Terrorist Attack : ఉగ్రవాద చర్యలు సమాజంపై మాయని మచ్చ : సీఎం చంద్రబాబు