Dating Apps: హైదరాబాద్‌లో వివాహేతర డేటింగ్ యాప్‌లో అమ్మాయిలే టాప్
- Author : Vamsi Chowdary Korata
Date : 03-04-2026 - 10:40 IST
Published By : Hashtagu Telugu Desk
Online Dating App వివాహేతర సంబంధాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఫ్రెంచ్ డేటింగ్ యాప్ ‘గ్లీడెన్’ (Gleeden) భారత్‌లో అనూహ్యంగా విస్తరిస్తోంది. దేశవ్యాప్తంగా ఈ యాప్ వినియోగదారుల సంఖ్య 40 లక్షల (4 మిలియన్ల) మైలురాయిని దాటినట్లు కంపెనీ తాజాగా వెల్లడించింది. ఈ జాబితాలో టెక్ హబ్స్ అయిన బెంగళూరు, హైదరాబాద్ నగరాలు అగ్రస్థానంలో నిలవడం గమనార్హం.
గ్లీడెన్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం మొత్తం యూజర్లలో 18 శాతం మందితో బెంగళూరు మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానంలో 17 శాతం యూజర్లతో హైదరాబాద్ నిలిచింది. వీటి తర్వాత ఢిల్లీ (11 శాతం), ముంబై (9 శాతం), పుణె (7 శాతం) నగరాలు ఉన్నాయి. కేవలం మెట్రో నగరాలే కాకుండా లక్నో, చండీగఢ్, సూరత్ వంటి టైర్-2 నగరాల్లోనూ వినియోగం పెరుగుతున్నట్లు కంపెనీ పేర్కొంది.
ఈ ప్లాట్‌ఫారమ్‌పై పురుషుల వాటా 65 శాతం ఉండగా, మహిళల వాటా 35 శాతంగా ఉంది. అయితే, గత రెండేళ్లలో మహిళా వినియోగదారుల సంఖ్య 148 శాతం పెరగడం ఈ మార్పుకు అద్దం పడుతోంది. “భారత్‌లో 40 లక్షల యూజర్ల మైలురాయిని దాటడం మాకు ఒక కీలక ఘట్టం. ఆధునిక సంబంధాల విషయంలో ప్రజల దృక్పథంలో వస్తున్న నిశ్శబ్ద విప్లవానికి, డిజిటల్ వినియోగం పెరగడానికి ఇది నిదర్శనం” అని గ్లీడెన్ ఇండియా కంట్రీ మేనేజర్ సిబిల్ షిడెల్ తెలిపారు.