Hyderabad : మందుబాబులు ఈరోజే సరుకు నింపుకోండి..3 రోజులు వైన్స్ బంద్
Hyderabad : సోమవారం సాయంత్రం 4 గంటల నుంచి బుధవారం సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు, బార్లు, రిజిస్టర్డ్ క్లబ్బులు అన్నీ మూసివేయాలని (Wine Shops Close)అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు
- By Sudheer Published Date - 11:30 AM, Mon - 21 April 25

హైదరాబాద్ (Hyderabad) నగరంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల (Local body MLC elections) నేపథ్యంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. సోమవారం సాయంత్రం 4 గంటల నుంచి బుధవారం సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు, బార్లు, రిజిస్టర్డ్ క్లబ్బులు అన్నీ మూసివేయాలని (Wine Shops Close)అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల నిబంధనల ప్రకారం.. మద్యం వాడకం వల్ల ఓటర్లపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో ఈ ముందస్తు చర్యలు తీసుకున్నారు. అందుకే మందుబాబులు ఈరోజే సరుకును నిల్వ చేసుకోవాలి అంటూ సూచిస్తున్నారు.
మంగళవారం జరుగుతున్న ఎన్నికల్లో కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, హింసాత్మక ఘటనలు జరగకుండా ఉండేందుకు ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. గతంలో జరిగిన అనుభవాల ప్రకారం, ఎన్నికల సమయంలో మద్యం సరఫరా వల్ల ఘర్షణలు, వివాదాలు చోటుచేసుకున్న ఘటనల నేపథ్యంలో ఈసారి ముందుగానే కఠినంగా వ్యవహరించాలని అధికారులు నిర్ణయించారు.
ఈ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు పోటీకి దూరంగా ఉండగా, బీజేపీ, ఎంఐఎం బరిలో నిలిచాయి. తాజా రాజకీయ సమీకరణాలను బట్టి చూస్తే ఎంఐఎం పార్టీకి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎన్నికలు ముగిసిన అనంతరం బుధవారం సాయంత్రం 6 గంటల తర్వాత మద్యం దుకాణాలు మళ్లీ తెరుచుకుంటాయని అధికారులు స్పష్టం చేశారు.