Akshaya Tritiya 2025: అక్షయ తృతీయ రోజు లక్ష్మీ అనుగ్రహం కోసం ఇంట్లో ఏ దిశలో దీపాలు పెట్టాలో మీకు తెలుసా?
అక్షయ తృతీయ పండుగ రోజు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఇంట్లో ఏ దిశలో దీపాలు పెట్టాలి? దానివల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అన్న విషయాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 11:02 AM, Mon - 21 April 25

ప్రతి ఏడాది వైశాఖ మాసంలో శుక్ల పక్షంలో తృతీయ రోజున అక్షయ తృతీయ జరుపుకుంటారు. ఈ సంవత్సరం అనగా 2025 అక్షయ తృతీయ పండగను ఏప్రిల్ 30 న జరుపుకోనున్నారు. సంపదకు అధిపతి అయిన లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ రోజున బంగారం, వెండి నగలు కొనడం ఆచారం. బంగారం, వెండి కొనడం వల్ల ఇంటికి సంపద, శ్రేయస్సు వస్తుందని చాలా మంది నమ్మకం. అయితే బంగారం కొనుగోలు చేయలేని వారు కొన్ని రకాల వస్తువులు కొనుగోలు చేసినా కూడా అంతటి ఫలితం దక్కుతుందని పండితులు చెబుతున్నారు.
ఆ సంగతి పక్కన పెడితే అక్షయ తృతీయ అంటే కేవలం ఇతర వస్తువులు కొనుగోలు చేయడం మాత్రమే కాదు ఈరోజు దీపాలు వెలిగించడం అన్నది కూడా చాలా ముఖ్యం అని చెబుతున్నారు. మరి ఈరోజున ఇంట్లో ఎక్కడ దీపాలు పెట్టాలో దానివల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇంటి ఉత్తర దిశను సంపదకు అధిపతి అయిన కుబేరుడు, లక్ష్మీ దేవి దిశగా పరిగణిస్తారు. అక్షయ తృతీయ రోజున ఇంట్లో ఈ దిశలో దీపం వెలిగించడం వల్ల సంపద, శ్రేయస్సు, ఆనందం, శాంతి లభిస్తాయని నమ్ముతారు.
అలాగే లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం కూడా లభిస్తుందని భక్తుల నమ్మకం. ఇంట్లో త్రాగునీరు నిల్వ ఉంచడానికి వంటగదిలో ఒక ప్రత్యేక స్థలం ఉంటుంది. అక్షయ తృతీయ సాయంత్రం ఇక్కడ కూడా దీపం వెలిగించాలి. ఇలా చేయడం ద్వారా మీ పూర్వీకుల ఆశీస్సులు మీపై ఉంటాయట. భవిష్యత్తులో వచ్చే ఇబ్బందులు తొలగిపోతాయట. మీ ఇంటి ఆవరణలో బావి, చెరువు లేదా ఇతర నీటి వనరులు ఉంటే అక్కడ కూడా దీపం వెలిగించాలట. నీటి వనరుల దగ్గర దీపాలు వెలిగించడం ప్రకృతికి, దేవతలకు కృతజ్ఞతను వ్యక్తపరిచే ఒక మార్గం అని చెబుతున్నారు. అక్షయ తృతీయ సాయంత్రం, ఇంటి ప్రధాన ద్వారం రెండు వైపులా నెయ్యితో చేసిన మట్టి దీపాలను వెలిగించాలట. ఇక్కడి నుండే లక్ష్మీ దేవి ఇంట్లోకి అడుగు పెడుతుందని నమ్మకం. వెలుతురు, పరిశుభ్రత ఉన్న చోట మాత్రమే లక్ష్మీ దేవి నివసిస్తుంది. ఇక్కడ దీపం వెలిగించడం వల్ల సంపద, శ్రేయస్సు పెరుగుతుందని నమ్మకం.