Telangana Politics: ఔను..టీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసాయి.!
కాంగ్రెస్ , టీఆర్ఎస్ పొత్తు దిశగా వెళ్లే అవకాశం తెలంగాణలో ఉందా? కాంగ్రెస్ సీనియర్ లు కొందరు చేస్తున్న ప్రయత్నం ఫలించ బోతుందా? అంటే కాజీపేట రైల్వే కోచ్ కోసం ఆ రెండు పార్టీలు కలిసి చేసిన ఆందోళన చూస్తే ..ఔను అనిపిస్తోంది.
- By CS Rao Published Date - 08:57 AM, Tue - 1 February 22

కాంగ్రెస్ , టీఆర్ఎస్ పొత్తు దిశగా వెళ్లే అవకాశం తెలంగాణలో ఉందా? కాంగ్రెస్ సీనియర్ లు కొందరు చేస్తున్న ప్రయత్నం ఫలించ బోతుందా? అంటే కాజీపేట రైల్వే కోచ్ కోసం ఆ రెండు పార్టీలు కలిసి చేసిన ఆందోళన చూస్తే ..ఔను అనిపిస్తోంది. కాంగ్రెస్ ముక్త్ భారత్ దిశగా బీజేపీ వెళుతుంది. ఆ మేరకు చాలా రాష్ట్రాల్లో ఆ పార్టీ జెండా ఎగురుతుంది. కొన్ని చోట్ల నేరుగా అధికారంలోకి వచ్చింది. మిగిలిన చోట్లా అధికారాన్ని ప్రత్యర్థుల నుంచి లాక్కుంది. ఇవన్నీ చూస్తున్న కేసీఆర్ బీజేపీ ని టార్గెట్ చేసాడు. హుజురాబాద్ ఎన్నికల ఫలితాల తరువాత బీజేపీ అడుగులు ఆయనకు అనుమానం కలిగిస్తున్నాయి. పైగా తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యం అంటూ కమలనాథులు దూసుకెళ్తున్నారు. ఆ దూకుడును తట్టుకోవడానికి కేసీఆర్ పలు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఫెడరల్ ఫ్రంట్ అని కొన్ని రోజులు, ఢిల్లీలో ఉద్యమాలు అని మరి కొన్ని రోజులు హడావిడి చేసాడు. రాష్ట్రంలో గల్లీ వరకు బీజేపీ మీద ఉద్యమం చేయాలని నిర్ణయించాడు. పైగా కాంగ్రెస్ బలపడుతుందని టీఆర్ఎస్ భావిస్తోంది. అదే జరిగితే టీఆర్ఎస్ పార్టీకి నష్టం జరిగే అవకాశం లేకపోలేదు. అందుకే ఇప్పటి నుంచే కేసీఆర్ రాజకీయ పావులు కదుపుతున్నాడు.
సాధారణంగా జాతీయ పార్టీల నేతలు ఢిల్లీ పీఠంపై ఎక్కువగా దృష్టి పెడతారు. దానికోసం చాలా సందర్భాల్లో రాష్ట్రాలను వదులుకున్న సంఘటనలు ఉన్నాయి. ఆ విషయం కేసీఆర్ కు బాగా తెలుసు. అందుకే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వడం ద్వారా రాష్ట్రంలో ఈసారి కూడా ఎలాగైనా అధికారంలోకి రావాలని చూస్తున్నాడు. ప్రస్తుతం ఆయన సేకరించిన సర్వేల ప్రకారం అధికారంలోకి రావడం కష్టంగా భావిస్తున్నాడు అని ఆ పార్టీ అంతర్గత చర్చ. అందుకే తిరుగులేని విధంగా రాజకీయ వ్యూహాలను ఢిల్లీ కేంద్రంగా రచిస్తున్నాడు. ఐదు రాష్ట్రాల ఫలితాల తరువాత కేసీఆర్ అసలు అస్త్రాన్ని బయటకు తీయబోతున్నాడు. ఒక వేళ కాంగ్రెస్ కు అనుకూల ఫలితాలు వస్తే రాష్ట్రంలో ఆ పార్టీ తో కలసి నడవడానికి ఎత్తులు వేయాలని ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్లను అనుకూలంగా మలచు కున్నాడు. ఆ విషయం కాంగ్రెస్ లోని ఒక గ్రూప్ చెబుతుంది. జాతీయ స్థాయిలో మద్దతు ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ తో పాటు కమ్యూనిస్టులు కూడా కేసీఆర్ పంచన చేరే అవకాశం ఉంది. ఇటీవల ఉభయ కమ్యూనిస్ట్ అగ్ర నేతలు ప్రగతిభవన్లో కేసీఆర్ ను కలిసిన విషయం విదితమే. అప్పుడు బీజేపీ వర్సెస్ అన్నీ పార్టీల మాదిరిగా 2023 ఎన్నికలు జరగడానికి అవకాశం ఉంది. ఫలితంగా ఈజీగా అధికారంలోకి మరో సారి వచ్చే ఛాన్స్ కేసీఆర్ కు పక్కాగా ఉంటుంది. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తరువాత కేసీఆర్ గేమ్ ప్లాన్ మరే అవకాశం లేకపోలేదు. ఆ విషయం కాంగ్రెస్ కు బాగా తెలుసు. అందుకే ఆ పార్టీ కేసీఆర్ తో ఆచి తూచి అడుగు వేస్తుంది.
ఇక బీజేపీ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు సాధిస్తే తెలంగాణలో మరింత దూకుడుగా ముందుకు వెళ్తుంది. అయినప్పటికి ఇప్పుడు ఉన్న మాదిరిగా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వెళ్ళడానికి కేసీఆర్ ఎన్నికల వరకు ఉండే ఛాన్స్ ఉంది. ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని బీజేపీ ని ఎదుర్కొనే ప్లాన్ వేసే అవకాశం లేకపోలేదు. సో..ఎటు చూసినా కాంగ్రెస్ తో దోస్తీ టీఆర్ఎస్ పార్టీ కి కలిసొచ్చే అంశం. అందుకే కాజీపేట రైల్వే కోచ్ రూపంలో ఆ రెండు పార్టీలు కలిసి ఒక అడుగు వేసాయి. రాబోయే రోజుల్లో కలిసి ఇంకా మరిన్నీ ఆందోళనలు మోడీ సర్కారుకు వ్యతిరేకంగా చేయడానికి రెడి అవుతున్నాయి. పైగా ఆ రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరితే రేవంత్ హవాను కూడా తగ్గించడానికి ఛాన్స్ ఉంది. రేవంత్ రూపంలో భవిష్యత్ లో జరిగే రాజకీయ నష్టం కేసీఆర్ కు బాగా తెలుసు. అందుకే పొత్తుతో ఒక దెబ్బకు రెండు పిట్టల్లా అటు బీజేపీ ఇటు రేవంత్ ను జీరో చేయడానికి అవకాశం ఉంది. అందుకే కాజీపేట అస్త్రం టీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ ను కలిపింది. ఇక పొత్తు మిగిలింది. ఐదు రాష్ట్రాల ఫలితాల తరువాత పొత్తు కు కూడా క్లారిటీ రానుంది. సో..కాజీపేట రైల్వే కోచ్ ఆందోళన వెనక ఇంత కథ ఉందన్నమాట.