Whats Today : కృష్ణా జలాల పంచాయితీపై ఢిల్లీలో సమావేశం.. 215వ రోజుకు లోకేష్ పాదయాత్ర
Whats Today : తెలంగాణవ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద శని, ఆదివారాలు(డిసెంబరు 2, 3) బీఎల్‌వోలు అందుబాటులో ఉండేలా కేంద్ర ఎన్నికల కమిషన్ స్పెషల్ క్యాంపెయిన్ డే కార్యక్రమం చేపట్టింది.
- By Pasha Published Date - 07:51 AM, Sat - 2 December 23

Whats Today : తెలంగాణవ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద శని, ఆదివారాలు(డిసెంబరు 2, 3) బీఎల్‌వోలు అందుబాటులో ఉండేలా కేంద్ర ఎన్నికల కమిషన్ స్పెషల్ క్యాంపెయిన్ డే కార్యక్రమం చేపట్టింది. ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు బీఎల్‌వోలు ఆయా పోలింగ్ కేంద్రాల వద్దే ఉండేలా ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది. మీ ఓటు ముసాయిదా ఓటర్ల జాబితాలో లేకపోయినా, ఎలాంటి సందేహాలు ఉన్నా వెంటనే పోలింగ్ బూత్ వద్దకు వెళ్లి నేరుగా బీఎల్‌వోని కలిసి ఓటు గురించి తెలుసుకోవచ్చు.
- తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంచాయితీపై నేడు కేంద్ర జలశక్తి శాఖ సమావేశం జరగనుంది. ఈరోజు ఉదయం 11 గంటలకు ఢిల్లీలోని శ్రమ శక్తి భవన్‌లో హైబ్రిడ్ మోడ్‌లో తెలుగు రాష్ట్రాల అధికారులతో కేంద్ర జల శక్తి శాఖ అధికారులు సమావేశం కానున్నారు. ఏపీ పోలీసుల ఎంట్రీతో గురువారం తెల్లవారుజామున నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద ఏర్పడిన ఉద్రిక్తతలు, తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా నదీ జలాల పంపకాల సమస్యలపై తెలుగు రాష్ట్రాల అధికారులతో కేంద్ర జలశక్తి శాఖ అధికారులు చర్చించనున్నారు.
- నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేటితో 215వ రోజుకు చేరుకుంది. ఇప్పటివరకు 2944.6 కిలోమీటర్లు నడిచిన లోకేష్.. ఈరోజు ఉదయం 8 గంటలకు కాకినాడ రూరల్ తిమ్మాపురం యార్లగడ్డ గార్డెన్స్ నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. పవర జంక్షన్ వద్ద పాదయాత్ర పెద్దాపురం నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుంది. చిత్రాడ వద్ద పాదయాత్ర పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుంది.
- బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో నేటి నుంచి నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. జిల్లా కలెక్టరేట్‌లో 1077, 0861 2331261 నంబర్లతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. చేపల వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు సూచన చేశారు. జిల్లాలోని అధికారులు, ఉద్యోగులకు సెలవులు రద్దు చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
- మిచౌంగ్ తుఫాను హెచ్చరికలతో ప్రకాశం జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మత్స్యకారులను వేటకు వెళ్ల వద్దని ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగులకు సెలవులు రద్దు చేశారు. ఇవాళ్టి నుంచే అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేశారు. కలెక్టరేట్ లో 1077 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.
- రేపు తిరుమలలో కార్తీక వనభోజన మహోత్సవం జరుగుతుంది. పార్వేటి మండపం వద్ద మలయప్పస్వామివారికి స్నపన తిరుమంజనం(Whats Today) నిర్వహించనున్నారు.