Telangana Thalli Statue : తెలంగాణ తల్లిని తాము తిరస్కరిస్తున్నాం: ఎమ్మెల్సీ కవిత
వేలాది ఉద్యమకారులు నాడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టుకున్నారని అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు అంగీకరించడంలేదని ప్రశ్నించారు.
- By Latha Suma Published Date - 01:13 PM, Tue - 10 December 24

MLC Kavitha : సచివాలయంలో నూతన తెలంగాణ తల్లి విగ్రహాం మార్పు విషయంపై ఎమ్మెల్సీ కవిత మరోసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో కవిత తెలంగాణ తల్లి విగ్రహం మార్పునకు నిరసనగా హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేశారు. అనంతరం మాట్లాడుతూ.. వేలాది ఉద్యమకారులు నాడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టుకున్నారని అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు అంగీకరించడంలేదని ప్రశ్నించారు.
ఎంతో గోప్పగా ఉండే తెలంగాణ తల్లిని తీసి.. బీద తల్లిని పెట్టామని రేవంత్ రెడ్డి గొప్పలు చెప్తున్నాడని ఎమ్మెల్సీ కవిత అన్నారు. తెలంగాణ మహిళలు ఎప్పటికీ పేదగానే ఉండాలా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ తల్లిని తాము తిరస్కరిస్తున్నామని కవిత అన్నారు. ఉద్యమ తల్లే తమ తల్లి అని, హస్తం గుర్తు తల్లిని ఆమోదించేది లేదన్నారు. బతుకమ్మ పండుగను విగ్రహంలో ఎందుకు చేర్చలేదని అడిగారు. స్ఫూర్తి నింపే తెలంగాణ తల్లి విగ్రహం కాదని కాంగ్రెస్ తల్లిని పెట్టుకున్నారని, ఉద్యమ కాలం నాటి ప్రతీకలను అవమానించే యత్నమని, సచివాలయంలో పెట్టిన కాంగ్రెస్ తల్లిని తిరస్కరిస్తున్నామన్నారు.
కళాకారులు విమలక్క, మల్లు స్వారాజ్యం, సంధ్యలాంటి వారు కనిపించడంలేదా? తొమ్మిది మంది కళాకారులను సన్మనిస్తామన్నారని, కళాకారుల జాబితాలో మహిళలు ఎక్కడ? అని నిలదీశారు. మీ నోటి నుంచి ఎరుకల నాంచారమ్మ, బీడీ కార్మికుల మహిళల పేరు రాలేదన్నారు. ఉద్యమ కాలంలో ఏర్పాటు చేసుకున్న తెలంగాణ తల్లిని మార్చారని విమర్శించారు. విగ్రహం పెట్టామని చెప్పి సామన్య మహిళలకు ఇచ్చిన హామీలు ఎగ్గొడతారా అని నిలదీశారు. మహిళలకు ఇస్తామన్న రూ.2500 హామీ ఏమైందన్నారు. ఉద్యమ తల్లే మా తల్లి.. హస్తం గుర్తు తల్లిని ఆమోదించేది లేదన్నారు. రేవంత్ పిట్ట బెదిరింపులకు ఎవరూ భయపడరని ఎమ్మెల్సీ కవిత అన్నారు.
మరోవైపు ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం పట్ల కేవలం బీఆర్‌ఎస్ నేతలు మాత్రమే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా వ్యతిరేకత వస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ విగ్రహాన్ని మార్చడం పట్ల మాజీ సీఎం కేసీఆర్ కూడా స్పందిస్తూ తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం మూర్ఖత్వం అంటూ చెప్పుకు వచ్చారు. అయితే రాజకీయాలకు అతీతంగా తాము తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేశామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పుకు వస్తున్నారు.