Agnipath Protests : హింస వెనుక బీజేపీ వ్యతిరేకశక్తుల కుట్ర: విజయశాంతి
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తగలబెట్టిన ఘటన వెనుక బీజేపీ వ్యతిరేకశక్తుల కుట్ర ఉందని విజయశాంతి ఆరోపించారు.ఇది విద్యార్థులు, యువకుల పని అంటే నమ్మాలా? అంటూ ఆమె ప్రశ్నించారు. ఇది కచ్చితంగా బీజేపీ వ్యతిరేకులు కుట్ర పన్ని, రెచ్చగొట్టి చేయించిన విధ్వంసంగా పేర్కొన్నారు.
- Author : CS Rao
Date : 18-06-2022 - 5:00 IST
Published By : Hashtagu Telugu Desk
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తగలబెట్టిన ఘటన వెనుక బీజేపీ వ్యతిరేకశక్తుల కుట్ర ఉందని విజయశాంతి ఆరోపించారు.ఇది విద్యార్థులు, యువకుల పని అంటే నమ్మాలా? అంటూ ఆమె ప్రశ్నించారు. ఇది కచ్చితంగా బీజేపీ వ్యతిరేకులు కుట్ర పన్ని, రెచ్చగొట్టి చేయించిన విధ్వంసంగా పేర్కొన్నారు. కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేస్తున్నట్టుగా ఆర్మీ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న యువకులు, విద్యార్థుల చేసిన పనికాదని అన్నారు. అగ్నిపథ్ కు వ్యతిరేకంగా నడుస్తోన్న నిరసనల వెనుక కచ్చితంగా ప్రేరేపిత కుట్ర ఉందని ఆరోపించారు.
మోదీ సర్కారును వ్యతిరేకిస్తున్న అసాంఘిక శక్తులు, రౌడీ మూకల్ని రెచ్చగొట్టి చేయిస్తున్న హింసాకాండ అని విజయశాంతి పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమం ఏళ్ల తరబడి తీవ్రస్థాయిలో కొనసాగిన రోజుల్లో కూడా రాష్ట్ర విద్యార్థులు, యువతీయువకులు ఎంతో సంయమనంతో వ్యవహరించారని, రైల్ రోకోలు, వంటావార్పులు, బంద్ లు, శాంతియుత నిరసనలు చేపట్టారని వివరించారు. ఆ సమయంలో ఏనాడూ జాతి ఆస్తులను తగలబెట్టలేదని, అమాయక ప్రజలను భయభ్రాంతులకు గురిచేయలేదని విజయశాంతి వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం ఏళ్ల తరబడి ఉద్యోగాలు ఇవ్వకుండా తాత్సారం చేసినా విద్యార్థులు శాంతియుతంగానే ఉన్నారని తెలిపారు.
దేశం కోసం ఆర్మీలో చేరాలనుకునే విద్యార్థులు, యువకులు ఈ దేశ ఆస్తులనే పాడుచేస్తారా? అని సందేహం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో సంబంధంలేని వ్యక్తులు, దుకాణాలపై కత్తులు, కర్రలు, రాళ్లతో దాడులు చేశారని, పార్శిళ్లు తగలబెట్టారని, మహిళలు, వృద్ధులు సహా ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకునేలా విధ్వంసకారులు చేశారని అన్నారు. విధ్వంసం వెనుక కుట్ర త్వరలోనే బయటపడుతుందని విజయశాంతి హెచ్చరించారు.