KTR Contest @Jubilee Hills: జూబ్లిహిల్స్ బరిలో ‘కేటీఆర్’ పోటీ
తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి కేటీఆర్ జూబ్లీహిల్స్ లేదా ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని యోచిస్తున్నారు.
- By Balu J Published Date - 12:55 PM, Tue - 30 August 22

తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి కేటీఆర్ జూబ్లీహిల్స్ లేదా ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని యోచిస్తున్నారు. ప్రస్తుతం ఆయన సిరిసిల్ల నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నవిషయం తెలిసిందే. మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్‌మెంట్, పరిశ్రమలు, వాణిజ్యం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ & కమ్యూనికేషన్స్ శాఖల మంత్రిగా ఉన్న కేటీఆర్ గత ఎనిమిదేళ్లలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఎత్తిచూపుతూ టీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలక పాత్ర వహిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వ విధానాలపై చాలా సందర్భాలలో కేటీఆర్ బీజేపీకి స్ట్రాంగ్ కౌంటర్స్ ఇస్తున్నారు. రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షుడ్ని నుంచి మోడీ వరకు ఎవరినీ వదలడం లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ తో కలిసి బీజేపీ ని విమర్శించడంలో మందుంటున్నాడు. అయితే హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత బీజేపీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకుని తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ వేడి మరింత పెరుగుతోంది. మత భావాలను క్యాష్ చేసుకోవడానికి బీజేపీ నాయకులు ఆసక్తి చూపుతున్నారు.
కొద్ది నెలల క్రితం హైదరాబాద్ శివార్లలోని తుక్కుగూడలో జరిగిన బహిరంగ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ రాష్ట్రంలో ముస్లింలకు రిజర్వేషన్‌పై వ్యతిరేకంగా మాట్లాడారు. మత రిజర్వేషన్లకు పార్టీ వ్యతిరేకమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఆ రిజర్వేషన్లన్నింటినీ తొలగిస్తామని చెప్పారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌ల మధ్య హోరాహోరీగా సాగుతున్న ఈ తరుణంలో రానున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు గులాబీ పార్టీ కీలక నిర్ణయాలు తీసుకోనుందని తెలుస్తోంది. హైదరాబాద్‌లోని ఏదో ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనేది కేటీఆర్ వ్యూహంలో భాగమేనని తెలుస్తోంది.