Hyderabad MMTS : ఔటర్ చుట్టూ ఎంఎంటీఎస్ లో రూ.40 లతో ప్రయాణం
రూ.1,500 కోట్లతో రైల్వే లైను హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (HMDA) ఓఆర్‌ఆర్
- Author : Maheswara Rao Nadella
Date : 17-12-2022 - 1:02 IST
Published By : Hashtagu Telugu Desk
రూ.1,500 కోట్లతో రైల్వే లైను హైదరాబాద్ (Hyderabad) మహానగర అభివృద్ధి సంస్థ (HMDA) ఓఆర్‌ఆర్ (ORR) చుట్టూ రైల్వే లైను (Railway Line) నిర్మించాలని ప్రణాళికలు రచించింది. ఈ మేరకు రైల్వే లైన్లు నిర్మించేందుకు స్థలాన్ని సైతం కేటాయించింది. ప్రస్తుత లెక్కల ప్రకారం ఒక కిలోమీటరు రైల్వే లైను నిర్మాణానికి రూ.10 కోట్లు అవుతుందని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఇలా రూ.1,500 కోట్లతో రైల్వే లైన్లు నిర్మాణం పూర్తవుతుంది. ఓఆర్‌ఆర్ (ORR) చుట్టూ రెండో లైను కోసం మరో రూ.1,500 కోట్లు కేటాయించాలి. స్టేషన్లు, రైళ్లకు అదనంగా ఖర్చు చేయాలి.
ఇరువైపులా:
హైదరాబాద్ (Hyderabad) ఓఆర్‌ఆర్‌ను (ORR) ఆనుకుని గేటెడ్ కమ్యూనిటీలు, అపార్టుమెంట్లు, విల్లాలు, ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇప్పటికే నివాసాలు బాగా పెరిగాయి. కొత్తగా ఇల్లు తీసుకోవాలనుకునే వారు ఓఆర్‌ఆర్ (ORR) చేరువకు చేరిపోతున్నారు. ఓఆర్‌ఆర్‌కు చేరువగా ఇప్పటికే ప్రముఖ ఐటీ సంస్థలు కొన్ని ఉండగా, కొత్తగా కూడా వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఔటర్ రింగురోడ్డు చుట్టూ రైల్వే లైను నిర్మించి లోకల్ రైళ్లు పరుగులు పెడితే ఎంతోమందికి ప్రజారవాణా చేరువవుతుంది. పశ్చిమాన తెల్లాపూర్, తూర్పున ఘట్‌కేసర్, ఉత్తరాన మేడ్చల్, దక్షిణం వైపు ఉందానగర్ వరకూ ఎంఎంటీఎస్ (MMTS) రెండో దశ విస్తరించి ఉంది. ఇలా నలువైపుల నుంచి నగరంలోకి సులభంగా ఎంఎంటీఎస్ (MMTS) ద్వారా చేరుకోవచ్చు.
నలువైపులా స్టేషన్ల అభివృద్ధి:
నగరంలోని మూడు రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫారాలు అందుబాటులో లేక బయటే గంటలకొద్దీ వేచి ఉండాల్సి వస్తోంది. అందుకే విజయవాడ నుంచి వచ్చే రైళ్లను చర్లపల్లిలోనే ఆపేందుకు వీలుగా అక్కడ కొత్త రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేస్తున్నారు. ఇటు ముంబయి నుంచి వచ్చే రైళ్ల కోసం నాగులపల్లి దగ్గర స్టేషన్‌ను విస్తరించాల్సి ఉంది. బెంగళూరు నుంచి వచ్చే రైళ్లను ఉందానగర్ దగ్గర, నాందేడ్ మార్గంలో వచ్చే రైళ్లను మేడ్చల్ దగ్గర ఆపేయాలనే ప్రతిపాదనలూ ఉన్నాయి. ఈ నాలుగు స్టేషన్ల నిర్మాణాలను హెచ్‌ఎండీఏ ప్రతిపాదించింది. దూర ప్రాంతాల రైళ్లు కూడా నగరంలోకి రాకుండా.. చర్లపలి, ఉందానగర్, మేడ్చల్, నాగులపల్లి రైల్వే స్టేషన్లలో నగర ప్రయాణికులను దించేసి అటునుంచి అటే వెళ్లిపోయే అవకాశం ఉంది.
* ఓఆర్‌ఆర్ నిడివి 150 కి.మీ.
* ఓఆర్‌ఆర్ దాటాక 10 కి.మీ. వరకూ నగర విస్తరణ
* నగరంలోకి రాకుండానే బైపాస్ ద్వారా దూర ప్రాంతాల రైళ్లు
* నగరం నలువైపులా తలపెట్టిన రైల్వే స్టేషన్లు 4
* రూ.1,500 కోట్లతో రైల్వే లైను
Also Read: KOO vs Twitter : ‘కూ’ ఖాతాను నిలిపివేసిన ట్విటర్..