మున్సిపల్ ఎన్నికల ఫలితాలు..బిఆర్ఎస్ లో కాస్త జోష్ నింపింది ఆ మాజీ ఎమ్మెల్యేనే !!
తొర్రూరు మున్సిపాలిటీలోని మొత్తం 16 వార్డులకు గాను, ఏకంగా 10 వార్డులను కైవసం చేసుకుని బీఆర్ఎస్ స్పష్టమైన మెజారిటీని సాధించింది. అధికార పార్టీ అండదండలు, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మరియు ఝాన్సీ రెడ్డిల ప్రచారం ఉన్నప్పటికీ
- Author : Sudheer
Date : 13-02-2026 - 4:06 IST
Published By : Hashtagu Telugu Desk
Thorrur Municipal Election Results : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలినప్పటికీ, ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తన పట్టును నిరూపించుకుని పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు బీఆర్ఎస్ (BRS) పార్టీకి మిశ్రమ ఫలితాలను అందించాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 90 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జయకేతనం ఎగురవేసి భారీ ఆధిక్యాన్ని ప్రదర్శించగా, గులాబీ పార్టీకి పట్టణ ఓటర్లు షాక్ ఇచ్చారు. అధికారం కోల్పోయిన తర్వాత జరిగిన ఈ స్థానిక సమరంలో సత్తా చాటాలని భావించిన బీఆర్ఎస్ ఆశలు నెరవేరలేదు. అయితే, ఈ నిరాశాజనక వాతావరణంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాలకుర్తి నియోజకవర్గంలో సాధించిన విజయం పార్టీ శ్రేణుల్లో కాస్త జోష్ నింపింది. అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత చప్పబడిన కేడర్‌లో ఈ ఫలితం కొత్త ఊపిరి పోసింది.
పాలకుర్తి నియోజకవర్గ రాజకీయం గత అసెంబ్లీ ఎన్నికల నుండి అత్యంత ఆసక్తికరంగా మారింది. అప్పట్లో యంగ్ పొలిటీషియన్ యశస్విని రెడ్డి చేతిలో ఓటమి పాలైన ఎర్రబెల్లి, ఈ మున్సిపల్ ఎన్నికలను ఒక సవాల్‌గా తీసుకున్నారు. ముఖ్యంగా తొర్రూరు మున్సిపాలిటీ వేదికగా తన రాజకీయ భవిష్యత్తును, పట్టును నిరూపించుకోవాలని పట్టుదలతో పనిచేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కేటీఆర్‌ను స్వయంగా రప్పించి భారీ బహిరంగ సభలు నిర్వహించడమే కాకుండా, ప్రతి వార్డులోనూ తనదైన శైలిలో వ్యూహరచన చేశారు. ఈ కఠోర శ్రమ ఫలితంగా తొర్రూరులో గులాబీ జెండా రెపరెపలాడింది.
తొర్రూరు మున్సిపాలిటీలోని మొత్తం 16 వార్డులకు గాను, ఏకంగా 10 వార్డులను కైవసం చేసుకుని బీఆర్ఎస్ స్పష్టమైన మెజారిటీని సాధించింది. అధికార పార్టీ అండదండలు, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మరియు ఝాన్సీ రెడ్డిల ప్రచారం ఉన్నప్పటికీ, ఎర్రబెల్లి తన పాత క్యాడర్‌ను సమన్వయం చేసుకుని కాంగ్రెస్‌కు భారీ షాక్ ఇచ్చారు. విజయం ఖాయమన్న ధీమాతో ఉన్న కాంగ్రెస్ నేతలు ఈ ఫలితంతో ఒక్కసారిగా కంగుతిన్నారు. ఈ గెలుపు సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు కార్యకర్తలతో కలిసి డాన్సులు చేస్తూ సంబరాలు చేసుకోవడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ విజయం పాలకుర్తిలో ఎర్రబెల్లి పట్టు ఇంకా తగ్గలేదని చాటిచెప్పింది.