Sankranti Effect : విమానాల రేంజులో ఏసీ స్లీపర్ బస్సుల టికెట్ల ధరలు.. ఎంతో తెలుసా ?
హైదరాబాద్ టు రాజమండ్రికి(Sankranti Effect) విమాన టికెట్ రేటు కనిష్ఠంగా రూ.7,135, గరిష్ఠంగా రూ.15వేల మేర ఉంది.
- By Pasha Published Date - 02:05 PM, Fri - 10 January 25

Sankranti Effect : సంక్రాంతి పండుగ ఎఫెక్టుతో ప్రైవేటు ట్రావెల్స్ బస్సులలో టికెట్ల ధరలు అమాంతం పెరిగిపోయాయి. దీంతో తెలుగు రాష్ట్రాల ప్రయాణికులు లబోదిబోమంటున్నారు. హైదరాబాద్ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల టికెట్ల రేట్లు వేలల్లోనే ఉన్నాయి. భాగ్యనగరం నుంచి వైజాగ్, శ్రీకాకుళం వంటి ఏపీ ప్రధాన నగరాలకు వెళ్లే పలు ప్రైవేటు ట్రావెల్స్ ఏసీ స్లీపర్ క్లాస్ బస్సుల టికెట్ల రేట్లు రూ. 5 వేల నుంచి రూ.7వేల దాకా ఉన్నాయి. జనవరి 13న హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్‌కు వెళ్లే ఏసీ స్లీపర్ క్లాస్ బస్సులకు రూ.2,300, మంచిర్యాలకు వెళ్లే బస్సులకు రూ.3,500 చొప్పున టికెట్ల రేట్లను వసూలు చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్‌కు ఆర్టీసీ స్లీపర్ బస్సు టికెట్ ధర రూ.810, మంచిర్యాలకు ఆర్టీసీ స్లీపర్ బస్సు టికెట్ ధర రూ.860గా ఉంది. మరోవైపు సంక్రాంతి సీజన్ ముగిసేదాకా.. హైదరాబాద్ నుంచి ఏపీలోని రాజమండ్రి, తిరుపతి, విజయవాడలకు రాకపోకలు సాగించే విమానాల టికెట్ల ధరలు కూడా అంతే రేంజులో ఉన్నాయి.
Also Read :Rs 200 Crores Electricity Bill : రూ.200 కోట్ల కరెంటు బిల్లు.. నోరెళ్లబెట్టిన చిరువ్యాపారి
3 గంటల్లోనే గమ్యస్థానానికి..
ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల్లో ప్రయాణానికి సగటున 12 గంటల నుంచి 15 గంటల సమయం పడుతుంది. అదే ధరకు విమాన టికెట్‌ను కొంటే కేవలం 2 లేదా 3 గంటల్లోనే గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. అందుకే చాలామంది విమాన టికెట్లు కూడా బుక్ చేసుకుంటున్నారట. జనవరి 11, 12 తేదీల్లో ఎక్కువమంది హైదరాబాద్ నుంచి ఏపీకి విమానాల్లో వెళుతున్నారు. జనవరి 11న హైదరాబాద్-విశాఖపట్నం టికెట్ ధరలు రూ.10,019 నుంచి రూ.13,536 వరకు ఉన్నాయి. సాధారణ రోజుల్లోనైతే ఈ టికెట్ ధర కేవలం రూ.3,900 మాత్రమే. హైదరాబాద్ టు విజయవాడ విమాన టికెట్ రేటు సాధారణంగానైతే రూ.2,600.. ఇప్పుడు దీన్ని రూ.6,981కి విక్రయిస్తున్నారు. ఈ రూటులో విమాన టికెట్ రేటు గరిష్ఠంగా రూ.16వేల దాకా పలుకుతోంది. హైదరాబాద్ టు రాజమండ్రికి(Sankranti Effect) విమాన టికెట్ రేటు కనిష్ఠంగా రూ.7,135, గరిష్ఠంగా రూ.15వేల మేర ఉంది.
Also Read :Congress vs Regional Parties : ‘ఇండియా’లో విభేదాలు.. ఆధిపత్యం కోసం కాంగ్రెస్‌తో ప్రాంతీయ పార్టీల ఢీ
భారీగా బస్సులు.. సీట్లు కరువు
ఏపీఎస్‌ఆర్టీసీ హైదరాబాద్ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు నిత్యం 352 బస్సులు నడుపుతోంది. సంక్రాంతికి జనవరి 9 నుంచి జనవరి 12 వరకు 2,400 ప్రత్యేక బస్సులను ప్రకటించింది. చాలా రూట్లలో అన్నీ బుక్ అయిపోయాయి. టీజీఎస్‌ఆర్టీసీ తెలంగాణతో పాటు హైదరాబాద్ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు 6,432 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. తెలంగాణ ఆర్టీసీ, ఏపీఎస్ ఆర్టీసీ నడుపుతున్న ప్రత్యేక బస్సుల్లో 50% అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నా సీట్లు దొరకడం గగనంగా మారింది.