KCR in Assembly: కేసీఆర్ ప్రకటించే కీలక అంశాలు ఇవే..!
- Author : HashtagU Desk
Date : 09-03-2022 - 10:39 IST
Published By : Hashtagu Telugu Desk
రాష్ట్రంలోని నిరుద్యోగులంగా బుధవారం ఉదయం 10 గంటలకు అసెంబ్లీ చూడాలని వనపర్తి పర్యటనలో ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. తాను అసెంబ్లీలో ఓ కీలక ప్రకటన చేయబోతున్నానని చెప్పారు. ఏ విధమైన తెలంగాణ ఆవిష్కారమయిందో తాను అసెంబ్లీలో చెప్పానుకుంటున్నట్లుగా వెల్లడించారు. దీంతో 10 గంటలకు ప్రారంభమయ్యే అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఏం చెబుతారనే అంశంపై అటు రాజకీయవర్గాల్లోనూ, ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాసేపట్లో అసెంబ్లీలో ప్రకటన చేయనున్నారు. ఆయన ప్రకటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇక ఈరోజు అసెంబ్లీలో దాదాపు లక్ష ఉద్యోగాల ప్రక్రియకు సంబంధించి కేసీఆర్ ప్రకటన చేయనున్నారని సమాచారం. ఈ ప్రకటనలో ప్రధానంగా కాంటాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరించే అంశం ఉండే అవకాశం ఉంది. లాగే డీఎస్సీని పునరుద్ధరించే చాన్స్ ఉంది. ముఖ్యంగా స్థానికులకే వంద శాతం కల్పించేలా కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉంది.
ఇక తొలిసారి గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్లపై కూడా ప్రకటన ఉండే అవకాశముంది. ప్రధానంగా పోలీసు, వైద్య, విద్య రంగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసే విషయంపై స్పష్టత కేసీఆర్ ప్రకటన ద్వారా రానుందని తెలుస్తోంది.. తక్షణ నియామకాలు చేపట్టేలా ఆయన ప్రకటిస్తారని చెబుతున్నారు. మొత్తం లక్ష ఉద్యోగాలను భర్తీ చేసేలా ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించనున్నారని రాజకీయవర్గాల్లోనే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చే నడుస్తోంది.
ఇక ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో నిరుద్యోగుల అంశంపై కీలక ప్రకటన చేయనున్న నేపధ్యంలో రాష్ట్రమంతా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈరోజు అసెంబ్లీలో తెలంగాణ నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ గుడ్‌న్యూస్ చెప్పనున్నారని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. ఈ క్రమంలో జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీ లీడర్లు, కార్యకర్తల పిల్లలకు కూడా ఉద్యోగాలు వస్తాయని, దీంతో బండి సంజయ్, రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లాంటి వారు స్వీట్లు కొనుక్కొని రెడీగా ఉండాలని, కేసీఆర్ ప్రకటన వెలువడగానే మిఠాయిలు పంచుకోవాలని జీవన్ రెడ్డి సూచించారు.