Kavitha: నా వెనక ఏ జాతీయ పార్టీ లేదు.. కవిత సంచలన వ్యాఖ్యలు!
జాతీయ పార్టీల్లో చేరే ఉద్దేశం లేదని స్పష్టం చేసిన కవిత, కాంగ్రెస్ 'మునిగిపోయే పడవ' అని విమర్శించారు. తెలంగాణను ఆంధ్రలో కలిపింది. గతంలో వేలాది మంది బిడ్డలను బలితీసుకుంది కాంగ్రెస్సేనని, అభివృద్ధి పథంలో సాగుతోన్న తెలంగాణను భ్రష్టు పట్టిస్తున్నది కూడా కాంగ్రెస్సేనని దుయ్యబట్టారు.
- By Gopichand Published Date - 08:35 PM, Mon - 29 September 25

Kavitha: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) తన రాజకీయ భవిష్యత్తు, బీఆర్‌ఎస్‌లో జరిగిన పరిణామాలు, కొత్త పార్టీ ఏర్పాటు వంటి కీలక అంశాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ జాగృతి యూకే శాఖ ఆధ్వర్యంలో లండన్‌లో జరిగిన బతుకమ్మ సంబురాల్లో పాల్గొన్న అనంతరం ఆమె తెలంగాణ బిడ్డలతో ముఖాముఖి మాట్లాడారు.
20 ఏళ్లు బీఆర్‌ఎస్ కోసం కష్టపడ్డా
తన వెనక ఏ జాతీయ పార్టీ లేదని కవిత స్పష్టం చేశారు. “అలాంటిది ఏదైనా ఉన్నా తాను దాచుకునే వ్యక్తిని కాను” అని తేల్చి చెప్పారు. తాను 20 ఏళ్ల పాటు బీఆర్‌ఎస్ కోసం కష్టపడ్డానని తెలిపారు. పార్టీలో చీలికలు రావొద్దనే ఉద్దేశంతో ఎన్నో ఇబ్బందులు ఎదురైనా, పార్టీ బాగుండాలనే తపనతో తాను ఎంతో తగ్గి ఉన్నానని ఆవేదన వ్యక్తం చేశారు. “నా ఓటమి నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓటమి వరకు ఎన్నో కుట్రలు జరిగాయి. కుటుంబం, పార్టీ బాగుండాలనే ఉద్దేశంతో తాను ఎంతగా సఫర్ అయినా ఏ ఒక్క విషయం కూడా బయటకు చెప్పలేదు. తప్పనిసరి పరిస్థితుల్లోనే మాట్లాడాల్సి వచ్చింది” అని కవిత వివరించారు.
ఎమ్మెల్సీ పదవికి రాజీనామా, ఆమోదంపై సందేహాలు
పార్టీ నుంచి బయటికి పంపడంతో తాను ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశానని కవిత తెలిపారు. “తెలంగాణ వాళ్లకు రోషం ఎక్కువ ఉంటుంది. నన్ను పార్టీ వద్దు అనుకున్నది కాబట్టి, నేను పార్టీ ఇచ్చిన పదవిని వద్దు అనుకున్నాను” అని చెప్పారు. స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేసినా, చైర్మన్ ఎందుకు ఆమోదించడం లేదో తెలియదని, ఇది కాంగ్రెస్ రాజకీయాల్లో భాగం కావచ్చని వ్యాఖ్యానించారు. త్వరలోనే ఒత్తిడి తెచ్చి రాజీనామా ఆమోదింపజేసుకుంటానని ధీమా వ్యక్తం చేశారు.
Also Read: Bathukamma: గిన్నిస్ రికార్డు సాధించిన తెలంగాణ బతుకమ్మ!
స్వార్థం వ్యవస్థను భ్రష్టు పట్టిస్తోంది
తెలంగాణ సాధన కోసం ప్రాణం పోయినా పర్లేదు అని పనిచేసిన వారిలో కొందరిలో రానురాను స్వార్థం ప్రవేశించిందని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వ్యక్తులు మొత్తం వ్యవస్థను భ్రష్టు పట్టించేలా పని చేశారని ఆరోపించారు. “కొందరు వ్యక్తుల ప్రయోజనాల కోసం కోట్లాది మంది ప్రజలు సఫర్ కావడం మంచిది కాదు. వాటిని ఇప్పటికైనా బీఆర్‌ఎస్ పార్టీ సరి చేసుకుంటే బాగుంటుంది” అని హితవు పలికారు.
పార్టీ ఏర్పాటుపై స్పష్టత.. జైలు జీవితంపై వ్యాఖ్యలు
పార్టీ ఏర్పాటుపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కవిత స్పష్టం చేశారు. “తెలంగాణ జాగృతిని దేశానికే రోల్ మోడల్‌గా నిలపాలన్నదే తన సంకల్పం” అన్నారు. అవసరం, సందర్భం వచ్చినప్పుడు ప్రజలు కోరుకుంటే పార్టీ పెడతామని తెలిపారు. జైలు జీవితం తనలో అనేక మార్పులు తీసుకువచ్చిందని కవిత వెల్లడించారు. “సామాన్యుడు, ఒక స్త్రీ ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారో తాను ప్రత్యక్షంగా అనుభవించాను. జైలు జీవితం తనను సమూలంగా మార్చేసింది” అని పేర్కొన్నారు.
కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు
జాతీయ పార్టీల్లో చేరే ఉద్దేశం లేదని స్పష్టం చేసిన కవిత, కాంగ్రెస్ ‘మునిగిపోయే పడవ’ అని విమర్శించారు. తెలంగాణను ఆంధ్రలో కలిపింది. గతంలో వేలాది మంది బిడ్డలను బలితీసుకుంది కాంగ్రెస్సేనని, అభివృద్ధి పథంలో సాగుతోన్న తెలంగాణను భ్రష్టు పట్టిస్తున్నది కూడా కాంగ్రెస్సేనని దుయ్యబట్టారు. ఇక బీజేపీ డీఎన్‌ఏ తనకు సరిపడదని తేల్చి చెప్పారు. పట్టుదలతో తన పంథాను ఎంచుకుంటానని, జాగృతిని మరింత బలోపేతం చేస్తానని కవిత స్పష్టం చేశారు. ప్రజలకు ఏది మంచి చేస్తుందో ఆ దిశగా తన అడుగులు ఉంటాయని తెలిపారు.