CM KCR : కేసీఆర్ దీక్ష విరమణ..తెలంగాణ ప్రకటన డే
తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తున్నట్టు ప్రకటించిన రోజు డిసెంబర్ 9. అదే రోజున కేసీఆర్ నిరవధిక నిరహారదీక్షను విరమించాడు.
- By CS Rao Published Date - 01:18 PM, Thu - 9 December 21

తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తున్నట్టు ప్రకటించిన రోజు డిసెంబర్ 9. అదే రోజున కేసీఆర్ నిరవధిక నిరహారదీక్షను విరమించాడు. 11 రోజులు కేసీఆర్ చేసిన నిరవధిక దీక్షకు స్పందించిన ఆనాటి యూపీఏ ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించింది. 2009, నవంబరు 29న నిరాహార దీక్ష మొదలుపెట్టిన కేసిఆర్ , డిసెంబర్ 9న విరమించాడు. 11 రోజుల నిరవధిక దీక్ష సందర్భంగా చావునోట్లో తలపెట్టినట్టు కేసీఆర్ ఉటంకించాడు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపైనే కాకుండా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. కేంద్రం తెలంగాణ ఉద్యమాన్ని చల్లార్చే యత్నాలను తీవ్రతరం చేసింది. కాలంగడుస్తున్న కొద్దీ మరో ఉద్యమం పురుడుపోసుకుంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపకుడు కేసిఆర్ మలిదశ ఉద్యమానికి తెరలేపాడు.
తెలంగాణ వచ్చుడో…కేసిఆర్ సచ్చడో అన్న నినాదంతో 2009, నవంబరు 29వ తేదీన ఆమరణ దీక్షకు పిలుపునిచ్చాడు. 2009, నవంబరు 29న కరీంనగర్ లోని ఉత్తర తెలంగాణ భవన్ నుంచి సిద్ధిపేట దగ్గర రంగధాంపల్లి వద్ద దీక్షా స్థలాన్ని రూపొందించారు. అక్కడకు బయలుదేరిన కేసీఆర్ వాహనంను కరీంనగర్ మానేరు బ్రిడ్జ్ సమీపంలోని అలుగునూరు చౌరస్తాలో పోలీసు బలగాలు, రిజర్వ్ పోలీస్ బెటాలియన్లు చుట్టుముట్టారు. వాహనం నుంచి బలవంతంగా దిగిన కేసిఆర్ రోడ్డు మీదే ధర్నా చేస్తుండడంతో ఖమ్మం జైలుకు తరలించారు. ఆ జైలులోనే తన దీక్షను ప్రారంభించాడు.డిసెంబరు 1న నేను లేకున్నా ఉద్యమం నడవాలి అని కేసీఆర్ ప్రకటించాడు. డిసెంబరు 2న పార్లమెంట్‌లో అద్వానీ ఈ దీక్ష గురించి ప్రస్తావించాడు. ఆరోగ్యం క్షీణించడంతో డిసెంబర్ 3న కేసీఆర్‌ను హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. 4న తెలంగాణ వస్తే జైత్రయాత్ర, లేకుంటే నా శవయాత్రని కేసీఆర్ ప్రకటించాడు. 5న వెంకటస్వామి, చిరంజీవి, చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ ఎంపీలు కలిసి దీక్ష విరమించాలని కోరినా కేసీఆర్ నిరాకరించాడు. 6న అసెంబ్లీలో 14ఎఫ్‌ను రద్దు చేస్తూ తీర్మానం చేశారు.
కేసీఆర్ ఆరోగ్యం క్షీణించిందన్న సమాచారంతో తెలంగాణలోని పలుచోట్ల నిరసనలు వెల్లువెత్తాయి, బంద్ లు జరిగాయి. ఎటు చూసినా జై తెలంగాణ నినాదమే వినిపించింది. వరుస బంద్ లతో బస్సులు, రైళ్లు స్తంభించిపోయాయి. లాయర్లు, ఇంజినీర్లు, మేధావులు, రాజకీయ నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఇలా నాలుగున్నర కోట్లమంది ఒక్కటయ్యారు.డిసెంబరు 7న అప్పటి ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో అన్నిపార్టీలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు ప్రకటించాయి. డిసెంబరు 8న తెలంగాణ దిశగా సోనియాగాంధీ నిర్ణయం తీసుకున్నారు. దాంతో డిసెంబరు 9న కాంగ్రెస్ కోర్ కమిటీ ఐదుసార్లు సమావేశమైంది. తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నట్లుగా ప్రకటన చేయాలన్న సోనియా సూచన మేరకు కేంద్ర హోంమంత్రి హోదాలో చిదంబరం తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ప్రారంభించామని ప్రకటించారు. 11 రోజుల నిరవధిక దీక్షతో తెలంగాణకు ఏకంచేసిన కేసిఆర్ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన తరువాత ఆమరణ దీక్షను విరమించాడు. అందుకే, డిసెంబర్ 9కి తెలంగాణ చరిత్రలో ప్రత్యేకత ఉంది.