TGSRTC: బతుకమ్మ, దసరాకు టీజీఎస్ఆర్టీసీ 7754 ప్రత్యేక బస్సులు!
సద్దుల బతుకమ్మ ఈ నెల 30న దసరా అక్టోబర్ 2న ఉన్నందున సెప్టెంబర్ 27 నుంచి ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని TSRTC ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచనుంది.
- By Gopichand Published Date - 04:45 PM, Thu - 18 September 25

TGSRTC: బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ పండుగలకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 7754 ప్రత్యేక బస్సులను నడపడానికి ప్రణాళిక సిద్ధం చేసింది. వీటిలో 377 ప్రత్యేక సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సదుపాయం కల్పించారు. ఈ నెల 20 నుంచి అక్టోబర్ 2 వరకు ఈ ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి.
ప్రయాణ ఏర్పాట్లు, ఛార్జీలు
సద్దుల బతుకమ్మ ఈ నెల 30న దసరా అక్టోబర్ 2న ఉన్నందున సెప్టెంబర్ 27 నుంచి ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని TSRTC ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచనుంది. అంతేకాకుండా తిరుగు ప్రయాణానికి సంబంధించి అక్టోబర్ 5, 6 తేదీల్లో కూడా రద్దీకి అనుగుణంగా బస్సులను ఏర్పాటు చేయనుంది.
దసరా ప్రత్యేక బస్సుల్లో మాత్రమే ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 16 ప్రకారం తిరుగు ప్రయాణంలో ఖాళీగా వచ్చే బస్సులకు అయ్యే డీజిల్ ఖర్చుల మేరకు టికెట్ ధరలను సంస్థ సవరిస్తుంది. ఈ సవరించిన ఛార్జీలు సెప్టెంబర్ 20, 27 నుండి 30 వరకు, అలాగే అక్టోబర్ 1, 5, 6 తేదీల్లో నడిచే స్పెషల్ బస్సులకు మాత్రమే వర్తిస్తాయి. సాధారణ సర్వీసుల ఛార్జీలలో ఎటువంటి మార్పు ఉండదు.
Also Read: OG Ticket : ‘OG’ మూవీ టికెట్ రేట్స్ పెరిగింది..వివాదం మొదలైంది
హైదరాబాద్‌లో ప్రత్యేక బస్సుల సేవలు
హైదరాబాద్‌లోని ప్రధాన బస్టాండ్‌లైన ఎంజీబీఎస్ (MGBS), జేబీఎస్ (JBS), సీబీఎస్ (CBS)తో పాటు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే కేపీహెచ్‌బీ కాలనీ, ఉప్పల్ క్రాస్ రోడ్స్, దిల్ సుఖ్ నగర్, ఎల్బీనగర్, ఆరాంఘర్ వంటి ప్రాంతాల నుంచి కూడా ప్రత్యేక బస్సులను సంస్థ నడపనుంది. ఈ బస్సులు హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి రాష్ట్రం నలుమూలలతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలకు కూడా నడుస్తాయి.
ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ సందేశం
TSRTC మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనర్ మాట్లాడుతూ.. పండుగలకు ప్రజలకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడానికి సంస్థ సిద్ధంగా ఉందని తెలిపారు. గత దసరా కంటే ఈసారి అదనంగా 617 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశామన్నారు. రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో షామియానాలు, కుర్చీలు, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. పోలీసు, రవాణా, మున్సిపల్ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. అనుభవం గల డ్రైవర్లు ఉండటం వల్ల TSRTC బస్సుల్లో సురక్షితమైన ప్రయాణం ఉంటుందని, ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించి ఇబ్బందులు పడొద్దని ప్రజలకు ఆయన సూచించారు.
ముందస్తు రిజర్వేషన్ల కోసం
- బతుకమ్మ, దసరా ప్రత్యేక సర్వీసుల్లో ముందస్తు రిజర్వేషన్లను సంస్థ అధికారిక వెబ్‌సైట్ tgsrtcbus.inలో చేసుకోవచ్చు.
- మరిన్ని వివరాల కోసం టీఎస్‌ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033లను సంప్రదించాలని సూచించారు.