Bhatti Vikramarka: తెలంగాణ అప్పు అక్షరాలా రూ.8.21 లక్షల కోట్లు.. బీఆర్ఎస్పై భట్టి విక్రమార్క ఫైర్
- Author : Vamsi Chowdary Korata
Date : 03-07-2026 - 3:29 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ అప్పులపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈసారి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఘాటు ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో భారీ అప్పులు చేశారని అన్నారు. అప్పులపై కేసీఆర్, హరీశ్ రావు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
మాజీ మంత్రి హరీశ్ రావు తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని భట్టి మండిపడ్డారు. సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న అప్పులు, ఆర్థిక వ్యవహారాలపై వివరాలు వెల్లడించారు. తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకే కేటీఆర్, హరీశ్ రావు ఎదురుదాడి చేస్తున్నారని విమర్శించారు.
బీఆర్ఎస్ పాలనలో మొత్తం రూ.8.21 లక్షల కోట్ల అప్పులు చేసినట్లు భట్టి తెలిపారు. ఇందులో చెల్లించకుండా వదిలేసిన బకాయిలు కూడా ఉన్నాయని చెప్పారు. పదేళ్ల పాలన అబద్ధాల పునాదులపై సాగిందని విమర్శించారు. ఈ భారీ అప్పులపై మాజీ సీఎం కేసీఆర్ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
గత ప్రభుత్వ అప్పుల కారణంగా రెండున్నరేళ్లలో అసలు, వడ్డీలు కలిపి రూ.2,08,061 కోట్లు చెల్లించాల్సి వచ్చిందని భట్టి చెప్పారు. అయినప్పటికీ సంక్షేమ పథకాలను ఆపలేదన్నారు. అధిక వడ్డీ అప్పులను రీస్ట్రక్చరింగ్ చేయడం వల్ల వార్షిక వడ్డీ భారం రూ.34 వేల కోట్ల నుంచి రూ.11 వేల కోట్లకు తగ్గిందని వివరించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో సింగరేణిని సంక్షోభంలోకి నెట్టిందని భట్టి ఆరోపించారు. కొత్త కోల్ బ్లాకులు తీసుకురాలేదని విమర్శించారు. బొగ్గు మాయం ఆరోపణలపై ఇప్పటికే సింగరేణి విజిలెన్స్ విచారణకు ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. కొత్త కోల్ బ్లాకుల కోసం కేంద్రంతో చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు.