Telangana Debts : తెలంగాణ అప్పులు రూ.3.50 లక్షల కోట్లు – కేంద్రం
Telangana Debts : 2024 మార్చి 31 నాటికి తెలంగాణ ప్రభుత్వ అప్పులు రూ.3,50,520.39 కోట్లుగా ఉన్నాయని కేంద్రం పార్లమెంట్‌లో తెలిపింది.
- By Sudheer Published Date - 07:38 AM, Tue - 12 August 25

తెలంగాణ రాష్ట్ర అప్పుల(Telangana Debts)పై కేంద్ర ఆర్థిక శాఖ కీలక వివరాలను వెల్లడించింది. 2024 మార్చి 31 నాటికి తెలంగాణ ప్రభుత్వ అప్పులు రూ.3,50,520.39 కోట్లుగా ఉన్నాయని కేంద్రం పార్లమెంట్‌లో తెలిపింది. బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు (MP Raghunandan Rao) అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో ఈ వివరాలు ఇచ్చింది. ఈ మొత్తం అప్పులో బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో రూ.3,14,545 కోట్లు రుణాలు తీసుకుందని కేంద్రం స్పష్టం చేసింది. అయితే, ఈ అప్పులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఆస్తులను కూడా సృష్టించిందని, వాటి విలువ రూ.4,15,099.69 కోట్లుగా ఉందని పేర్కొంది. అంటే అప్పుల కంటే ఆస్తుల విలువ ఎక్కువగా ఉన్నట్లు తేలింది.
Mega DSC Results 2025 : ఏపీ మెగా DSC ఫలితాలు వచ్చేశాయ్..ఈ లింక్ తో ఫలితాలు చూసుకోవచ్చు
రాష్ట్రం ఏర్పడిన తొలి సంవత్సరంలో (2014-15) తెలంగాణ అప్పులు రూ.69,603.87 కోట్లు కాగా, ఆస్తులు రూ.83,142.68 కోట్లుగా ఉన్నాయి. క్రమంగా అప్పులు పెరుగుతూ వచ్చినా, వాటికి మించి ఆస్తులు పెరిగాయని కేంద్రం గణాంకాలు చూపుతున్నాయి. ఇది బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆర్థిక నిర్వహణలో ఒక కీలకమైన అంశమని ఆ పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వంటి కీలక ప్రాజెక్టులకు తీసుకున్న అప్పులు ఆస్తుల కల్పనకు ఉపయోగపడ్డాయని వివరించారు.
అయితే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక నిర్వహణపై విమర్శలు పెరుగుతున్నాయి. కేవలం కొన్ని నెలల్లోనే ప్రభుత్వం పెద్ద మొత్తంలో అప్పులు చేసిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రస్తుత ప్రభుత్వం ఆరు గ్యారంటీలు, ఇతర సంక్షేమ పథకాల అమలు కోసం అప్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పారదర్శకంగా, సమగ్రంగా ఉండాలని సూచిస్తున్నారు. కేంద్రం వెల్లడించిన ఈ గణాంకాలు రాష్ట్రంలో రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధానికి కొత్త ఆజ్యం పోసే అవకాశం ఉంది.