Fake Doctors Exposed : 100 మంది ఫేక్ డాక్టర్లు దొరికారు.. జనం ప్రాణాలతో చెలగాటం
ఇంకొందరు గుర్తింపు లేని యూనివర్సిటీల నుంచి మెడికల్ డిగ్రీలు(Fake Doctors Exposed) కొనుక్కొని డాక్టర్లుగా క్లినిక్‌లు నడిపిస్తున్నారు.
- By Pasha Published Date - 10:44 AM, Sun - 8 December 24

Fake Doctors Exposed : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నకిలీ డాక్టర్లు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో తెలంగాణ మెడికల్ కౌన్సిల్‌కు చెందిన 30 బృందాలు నిర్వహించిన తనిఖీల్లో 100 మందికిపైగా నకిలీ డాక్టర్లను గుర్తించారు. వీరిపై నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్‌ఎంసీ) చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. వైద్యపరమైన అర్హతలు లేని వ్యక్తులు క్లినిక్‌లు తెరవడం, ప్రాక్టీస్ చేయడం అనేది క్రైమ్. కనీసం ఎంబీబీఎస్, ఇతర మెడికల్ డిగ్రీలు లేకుండానే వారు మెడికల్ ప్రాక్టీసు చేస్తున్నట్లు వెల్లడైంది. కొందరు ఫేక్ డాక్టర్లు.. నకిలీ మెడికల్ డిగ్రీలను తయారు చేయించి, వాటినే లామినేషన్ చేయించి క్లినిక్‌లో డిస్‌ప్లే చేస్తున్నారు. ఇంకొందరు గుర్తింపు లేని యూనివర్సిటీల నుంచి మెడికల్ డిగ్రీలు(Fake Doctors Exposed) కొనుక్కొని డాక్టర్లుగా క్లినిక్‌లు నడిపిస్తున్నారు. కొందరు ఎంబీబీఎస్ మాత్రమే చేసినా.. ఎండీ బోర్డును వాడుకుంటున్నారు. ఇంకొందరు డెంటల్ డిగ్రీ చేసి.. చర్మ వ్యాధులకు చికిత్స చేస్తున్నారు.
Also Read :Weekly Horoscope : డిసెంబరు 9 నుంచి 15 వరకు వారఫలాలు.. మంగళ, బుధవారాల్లో ఆ రాశుల వారికి అలర్ట్
ఫేక్ డాక్టర్లు ప్రధానంగా బస్తీలు, మురికి వాడలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. అలాంటి ఏరియాల్లోనే క్లినిక్‌లను నడుపుతున్నారు. ఫేక్ డాక్టర్లు కేవలం రూ.50 నుంచి రూ.100 వరకే ఫీజులు వసూలు చేస్తున్నారు. దీంతో ప్రజలు పెద్దసంఖ్యలో వాళ్ల క్లినిక్‌లకే వెళ్తున్నారు. ఈ క్లినిక్‌లకు వెళ్లే రోగులకు ఫేక్ డాక్టర్లు అధిక మోతాదుతో కూడిన మందులను సిఫార్సు చేస్తున్నారు. హై యాంటిబయోటిక్స్‌తో అప్పటికప్పుడు రోగం నయమైనా.. దీర్ఘకాలంలో తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. ఫేక్ డాక్టర్లు తమ క్లినిక్‌లలోనే మెడికల్ షాపులను నడుపుతూ బాగా సంపాదిస్తున్నారు. ఇలాంటి 140కిపైగా మెడికల్ షాపులను తెలంగాణ ఔషధ నియంత్రణ విభాగం గుర్తించింది. మొత్తం మీద ఫేక్ డాక్టర్ల వల్ల హైదరాబాద్ ప్రజల ప్రాణాలు ముప్పును ఎదుర్కొంటున్నాయి.