Ration Cards Update : రేషన్ కార్డుల లబ్ధిదారులూ బీ అలర్ట్.. త్వరలో ‘నో యువర్ కస్టమర్’
Ration Cards Update : రేషన్ కార్డులలోని లబ్ధిదారుల వివరాల్లో పారదర్శకతను పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
- By Pasha Published Date - 12:25 PM, Tue - 12 September 23

Ration Cards Update : రేషన్ కార్డులలోని లబ్ధిదారుల వివరాల్లో పారదర్శకతను పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డు కలిగి ఉన్న వారి కుటుంబ సభ్యుల వివరాలను అప్ డేట్ చేసేందుకుగానూ ‘నో యువర్ కస్టమర్’ ప్రక్రియకు ఒకటి, రెండు రోజుల్లో శ్రీకారం చుట్టనుంది. ఇందులో భాగంగా ప్రతి కార్డు ద్వారా లబ్ధిపొందే వారందరినీ ఒకసారి రేషన్ షాపుకు పిలిపించి వేలిముద్రలను నమోదు చేసుకోనున్నారు. ఇలా చేయడం ద్వారా లబ్ధిదారుల్లో చనిపోయిన వారి పేర్లు తొలగిపోతాయి. ఫలితంగా బియ్యం, సరకుల కోటా తగ్గుతుందని రాష్ట్ర సర్కారు భావిస్తోంది. వాస్తవానికి ఈ ప్రక్రియను ఈ నెల 11 నుంచే చేపట్టాలని భావించారు. అయితే సాంకేతిక కారణాలతో అవాంతరం ఏర్పడింది. శుక్రవారంలోగా రేషన్ కార్డుల లబ్ధిదారుల వేలిముద్రల సేకరణ ప్రక్రియ మొదలవుతుందని అంటున్నారు.
Also read : D Srinivas: డీఎస్ పరిస్థితి విషమం.. ఐసీయూలో ట్రీట్ మెంట్!
వాస్తవానికి కుటుంబసభ్యుల సంఖ్య తగ్గితే.. ఆ కుటుంబ పెద్దలే అధికారులకు సమాచారమిచ్చి పేర్లను తొలగించాలి. కానీ ఈ ప్రక్రియ జరగడం లేదు. దీనివల్ల చనిపోయిన వారి పేరిట కూడా బియ్యం కోటా కేటాయింపు జరుగుతోంది. ఫలితంగా ప్రభుత్వ ధనం వేస్ట్ అవుతోంది. ‘నో యువర్ కస్టమర్’ ప్రక్రియతో దీనికి అడ్డుకట్ట పడనుంది. అయితే రేషన్ కార్డుల లబ్ధిదారులందరినీ చౌకధరల డిపోలకు పిలిపించి.. వివరాలను అప్ డేట్ చేయడమంటే పెద్ద పనే. ఇదంతా పూర్తి కావడానికి కొన్ని నెలల సమయం పట్టినా ఆశ్చర్యం లేదని పరిశీలకులు (Ration Cards Update) అభిప్రాయపడుతున్నారు.