Dharani Portal : ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతలు ఎన్‌ఐసీకి.. ఎందుకంటే ?
ఈనేపథ్యంలో పోర్టల్‌కు(Dharani Portal) సంబంధించిన సాంకేతిక అంశాలపై ఎన్‌ఐసీకి సహకరించాలని టెరాసిస్‌కు తెలంగాణ ప్రభుత్వం సూచించింది.
- By Pasha Published Date - 12:15 PM, Tue - 22 October 24

Dharani Portal : ధరణి పోర్టల్ నిర్వహణ విషయమై తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దాని నిర్వహణ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వానికి చెందిన నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (ఎన్‌ఐసీ)కు అప్పగిస్తున్నట్లు వెల్లడించింది. రాబోయే మూడేళ్ల కోసం ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతలను ఎన్‌ఐసీ చేపడుతుందని తెలిపింది. ఈమేరకు ఎన్‌ఐసీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు పేర్కొంది.
Also Read :Nuclear Missile : మిస్సైళ్లు సంధించే సబ్ మెరైన్.. వైజాగ్‌లో ఆవిష్కరించిన నౌకాదళం
ఒకవేళ ఎన్‌ఐసీ పనితీరు బాగుంటే.. కాంట్రాక్టు గడువును మరో రెండేళ్లు పొడిగిస్తామని ఒప్పందంలో తెలంగాణ ప్రభుత్వం ప్రస్తావించింది. ఇప్పటివరకు ధరణి పోర్టల్ నిర్వహణను ప్రైవేట్ సంస్థ టెరాసిస్ చూసేది. ఇకపై ఆ బాధ్యతలను ఎన్‌ఐసీ చేపడుతుంది. గత కొన్నేళ్లుగా ధరణి పోర్టల్‌ను పర్యవేక్షించినందున దానికి సంబంధించిన సాంకేతిక అంశాలపై టెరాసిస్ కంపెనీకి మంచి అవగాహన ఉంది. ఈనేపథ్యంలో పోర్టల్‌కు(Dharani Portal) సంబంధించిన సాంకేతిక అంశాలపై ఎన్‌ఐసీకి సహకరించాలని టెరాసిస్‌కు తెలంగాణ ప్రభుత్వం సూచించింది. నవంబరు నెలాఖరు వరకు ఎన్‌ఐసీకి సహకరించాలని నిర్దేశించింది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతలను పూర్తిగా ప్రైవేటు కంపెనీలకే అప్పగించారు. రేవంత్ రెడ్డి సీఎం కాగానే పరిస్థితులు మారాయి. ఇంత కీలకమైన పోర్టల్‌ను విశ్వసనీయమైన సంస్థ చేతిలో ఉంచడం మంచిదని సీఎం భావించారు. ఇందులో భాగంగా తెలంగాణ ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, రెవెన్యూ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, టీజీటీఎస్ ఎండీతో పాటు పలువురు ఐఏఎస్‌లతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతలను ఎన్‌ఐసీ, టీజీటీఎస్, సీజీసీ సంస్థలకు అప్పగించే అంశంపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని సీఎం రేవంత్ ఆదేశించారు. అయితే అన్ని ఇతర సంస్థల కంటే తక్కువ వ్యయంతోనే పోర్టల్ నిర్వహణకు ఎన్‌ఐసీ ముందుకు వచ్చింది. దీంతో దానికే నిర్వహణ బాధ్యతలను అప్పగించాలని తెలంగాణ సర్కారు డిసైడ్ అయ్యింది.