Telangana: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 10వేలకు పైగా ఉద్యోగాలు!
ఈనెల 12 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈనెల 27 వరకు అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి.
- By Gopichand Published Date - 10:46 PM, Thu - 6 March 25

- 10,950 గ్రామాలకు క్షేత్రస్థాయి అధికారుల నియమానికి గ్రీన్‌సిగ్నల్
- కొత్త డివిజన్లు, మండలాలకు 217 పోస్టుల మంజూరు
- 33 సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పోస్టులకు సైతం క్యాబినేట్ ఆమోదం
- హర్షం వ్యక్తం చేసిన రెవెన్యూ ఉద్యోగ సంఘాలు డీసీఏ, టీజీటీఏ, టీజీఆర్ఎస్ఏ
Telangana: తెలంగాణ (Telangana) రెవెన్యూ శాఖ బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలకమైన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం చెప్పినట్టుగానే రాష్ట్రంలోని ప్రతి గ్రామానికొక క్షేత్రస్థాయిలో అధికారి ఉండేలా క్యాబినేట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇదే కాకుండా కొత్తగా ఏర్పడిన డివిజన్లు, మండలాలకు సైతం కొత్తగా పోస్టులను మంజూరు చేసింది. వీటితో పాటు సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల పోస్టులకు సైతం ఆమోద ముద్ర వేసింది. రాష్ట్ర క్యాబినేట్ నిర్ణయం పట్ల డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్(డీసీఏ) రాష్ట్ర అధ్యక్షకార్యదర్శులు వి.లచ్చిరెడ్డి, కె.రామకృష్ణ, తెలంగాణ తహశీల్దార్స్ అసోసియేషన్(టీజీటీఏ) రాష్ట్ర అధ్యక్షకార్యదర్శులు ఎస్.రాములు, రమేష్ పాక, తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్(టీజీఆర్ఎస్ఏ) రాష్ట్ర అధ్యక్షకార్యదర్శులు బాణాల రాంరెడ్డి, వి.భిక్షం హర్షం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలోని 10,950 గ్రామాలకు క్షేత్రస్థాయి అధికారుల నియమానికి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం, కొత్త డివిజన్లు, మండలాలకు 217 పోస్టుల మంజూరు, 33 సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పోస్టులకు సైతం క్యాబినేట్ ఆమోదం తెలుపడం పట్ల సీఎం రేవంత్‌రెడ్డికి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి, ఇతర మంత్రులకు, సీసీఎల్ఏ నవీన్ మిట్టల్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంతో రెవెన్యూ శాఖ బలోపేతంతో పాటు క్షేత్రస్థాయిలో రెవెన్యూ సేవలు రైతులకు, ప్రజలకు మరింత చేరువ అవుతాయన్నారు. దూరాభారం తగ్గుతుందన్నారు. సేవలు వేగంగా అందుతాయన్నారు.
Also Read: Wiaan Mulder: సన్‌రైజర్స్ జట్టులోకి సౌతాఫ్రికా ఆల్ రౌండర్!
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
ఈనెల 12 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈనెల 27 వరకు అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ భేటీలో ఉగాది నుంచి భూ భారతి అమలు చేయనున్నట్లు సమాచారం. ఫ్యూచర్ సిటీ కొరకు బోర్ట్ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. కొత్తగా 10,950 విలేజ్ లెవల్ ఆఫీసర్ పోస్టులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త మండలాలకు 217 పోస్టులు మంజూరుకు ఆమోదం ఇచ్చారు. 10 జిల్లా కోర్టులకు 55 పోస్టుల మంజూరుకు ఆమోదం తెలిపారు.