Fees Fear : ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల్లో ఫీ‘జులుం’.. నియంత్రణకు రెడీ అవుతున్న రేవంత్ సర్కార్
ప్రైవేటు విద్యాసంస్థలు ఏటా 10 శాతానికి మించకుండా ఫీజులు(Fees Fear) పెంచుకోవచ్చని ఆ కమిటీ సూచించింది.
- By Pasha Published Date - 11:05 AM, Sat - 28 December 24

Fees Fear : తెలంగాణలో బీటెక్ కంటే కొన్ని ప్రైవేటు స్కూళ్లలో ఎల్‌కేజీ ఫీజే ఎక్కువగా ఉందనే డిస్కషన్ నడుస్తోంది. భారీ ఫీజుల కారణంగా ప్రైవేటు పాఠశాలల్లో పిల్లల్ని చదివిస్తున్న పేరెంట్స్ లబోదిబోమంటున్నారు. వారి ఆవేదనను ఇటీవలే రాష్ట్ర అసెంబ్లీలో పలువురు ఎమ్మెల్యేలు వినిపించారు. దీంతో ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల్లో ఫీజుల నియంత్రణపై కమిటీని నియమించే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడించారు. భారీ ఫీజుల సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని త్వరలో ప్రభుత్వానికి వినతిపత్రం అందజేస్తామని హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్(హెచ్‌ఎస్‌పీఏ) సంయుక్త కార్యదర్శి వెంకట్ తెలిపారు. దీనిపై ప్రభుత్వం స్పందించకుంటే న్యాయపోరాటం చేస్తామని ఆయన వెల్లడించారు.
Also Read :Anil Ambanis Essay : ధీరూభాయ్ అంబానీ జయంతి.. తండ్రి గురించి అనిల్ అంబానీ ప్రత్యేక వ్యాసం
ప్రైవేటు బడుల్లో ట్యూషన్ ఫీజులను ఏటా 15 శాతం మేర పెంచుకునేందుకు ఛాన్స్ ఇవ్వాలని తెలంగాణ ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల సంఘం(ట్రస్మా) ఇటీవలే విద్యా కమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళిని కోరింది. ట్రస్మా కోరిన విధంగా ఏటా 15 శాతం మేర ఫీజులను పెంచితే.. ఐదేళ్లలో అవి రెట్టింపు అవుతాయి. ఓ విద్యార్థికి ఒకటో తరగతిలో రూ.20 వేల ఫీజు ఉంటే.. అతడు ఆరో తరగతికి చేరేసరికి ఆ ఫీజు రూ.40 వేలకు చేరిపోతుంది. పదో తరగతికి చేరేసరికి రూ.70 వేలు దాటేస్తుంది.
Also Read :Dhirubhai Ambani Car : ధీరూభాయ్ అంబానీ నడిపిన కారు.. సౌత్ సూపర్‌స్టార్‌కు ఎలా చేరింది ?
తెలంగాణలో విద్యారంగ సంస్కరణలపై సెప్టెంబరు 11న శ్రీధర్‌బాబు ఛైర్మన్‌గా మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటైంది. మళ్లీ ఇప్పటివరకు ఉప సంఘం సమావేశం కాలేదు. కొత్త విద్యా సంవత్సరం(2025-26) జూన్ రెండో వారంలో షురూ అవుతుంది. ఫీజులను డిసైడ్ చేసేందుకు 5 నెలల టైం మిగిలింది. ఫీజుల కట్టడి దిశగా చర్యలు చేపట్టాల్సిన బాధ్యత మంత్రివర్గ ఉప సంఘం భుజ స్కంధాలపై ఉంది. గత బీఆర్ఎస్ హయాంలో ప్రొఫెసర్ తిరుపతిరావు ఛైర్మన్‌గా ఏర్పాటు చేసిన కమిటీ 2017 డిసెంబరులో నివేదిక ఇచ్చింది. ప్రైవేటు విద్యాసంస్థలు ఏటా 10 శాతానికి మించకుండా ఫీజులు(Fees Fear) పెంచుకోవచ్చని ఆ కమిటీ సూచించింది. పాఠశాలల ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ ప్రభుత్వం 2022 ఏప్రిల్‌లో మంత్రివర్గ ఉప ఉపసంఘాన్ని నియమించింది. ఆ కమిటీ కూడా 10 శాతం వరకు ఏటా పెంచుకోవచ్చని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అయితే దానిపై నాటి బీఆర్ఎస్ సర్కారు తుది నిర్ణయాన్ని తీసుకోలేదు.