SC Classification : ఎస్సీ వర్గీకరణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం
ఎన్నో ఏళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతున్న చారిత్రాత్మకమైన సందర్భం ఇది. దళితులకు అండగా ఉంటూ వారి అభ్యున్నతికి మా ప్రభుత్వం కృషి చేస్తోంది. 1960 లోనే ఉమ్మడి రాష్ట్రంలో దామోదరం సంజీవయ్య లాంటి దళితున్ని ముఖ్యమంత్రిని చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది అన్నారు.
- By Latha Suma Published Date - 05:51 PM, Tue - 18 March 25

SC Classification : తెలంగాణ అసెంబ్లీ ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోదం తెలిపింది. బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించిన తెలంగాణ అసెంబ్లీ.. రాజకీయాలకు అతీతంగా బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి. ఇక, సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యేలు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో మాట్లాడారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి దళితులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటోందని తెలిపారు. పార్టీలో, ప్రభుత్వంలో ఎస్సీలకు కాంగ్రెస్ పార్టీ ఎన్నో అవకాశాలు ఇచ్చిందన్నారు. సుదీర్ఘమైన వర్గీకరణ పోరాటంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఎన్నో ఏళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతున్న చారిత్రాత్మకమైన సందర్భం ఇది. దళితులకు అండగా ఉంటూ వారి అభ్యున్నతికి మా ప్రభుత్వం కృషి చేస్తోంది. 1960 లోనే ఉమ్మడి రాష్ట్రంలో దామోదరం సంజీవయ్య లాంటి దళితున్ని ముఖ్యమంత్రిని చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది అన్నారు.
Read Also: Gummadi Narsaiah : సీఎం రేవంత్ తో గుమ్మడి నర్సయ్య భేటీ
ఇక, ఎస్సీలో 59 ఉప కులాలు ఉన్నాయి. ఆ కులాలను మూడు గ్రూపులుగా విభజించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మొదటి గ్రూప్ లో 15 ఉప కులాలున్నాయి. వారికి ఒక శాతం రిజర్వేషన్ ఇచ్చాం. రెండో గ్రూప్ లో 18 ఉపకులాలు ఉంటే వారికి 9 శాతం రిజర్వేషన్ ఇచ్చాం. మూడో గ్రూప్ లో 26 ఉపకులాలు ఉంటే. వారికి ఐదు శాతం రిజర్వేషన్ ఇస్తున్నామని ఆయన ప్రకటించారు. 59 కులాలు ఇప్పటివరకు పొందిన ప్రయోజనాల ఆధారంగా కమిషన్ సిఫార్సులు చేసింది అని సీఎం వివరించారు. ఎస్సీ వర్గీకరణ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించిన సభ్యులకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు.
అలాగే, వివేక్ వెంకటస్వామి సూచన మేరకు జనాభా ప్రకారం రిజర్వేషన్ పెంచుతాం.. 2026 జనాభా లెక్కలు వచ్చిన వెంటనే దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచుతాం.. గ్రూపుల వారీగా పంచుతామని వెల్లడించారు. రిజర్వేషన్లు పెంచాలంటే సహేతుకమైన విధానం ఉండాలని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన గంటలోపే ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం ప్రకటించాం. వెంటనే ఉత్తమ్ నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం నియమించాం. మంత్రివర్గ ఉపసంఘం సూచన మేరకు షమీమ్ అక్తర్ కమిషన్ నియమించాం. కమిషన్.. ప్రజల నుంచి 8,681 ప్రతిపాదనలు స్వీకరించింది. కమిషన్ నివేదికను ఏ మాత్రం మార్చకుండా ఆమోదించాం అన్నారు.
ఇందిరమ్మ రాజ్యంలో మీకు అన్యాయం జరగదు. రిజర్వేషన్లను పెంచి వాటిని అమలు చేసే బాధ్యత మేం తీసుకుంటాం అని అన్నారు. 2026 జనగణన పూర్తి కాగానే ఆ లెక్కల ప్రకారం ఎస్సీ రిజర్వేషన్లు పెంచుతాం. రిజర్వేషన్లు పెంచడం వాటిని సహేతుకంగా పంచడం మా బాధ్యత. సభా నాయకుడిగా నేను మాట ఇస్తున్నామని తెలిపారు. తెలంగాణ కులగణన సర్వే చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. ఇందులో మేం భాగస్వాములవడం మాకు గర్వకారణం .దీనిని బీసీ సోదరులు అర్థం చేసుకోవాలి..తప్పుపడితే నష్టపోయేది బీసీ సోదరులే. కేవలం డాక్యుమెంట్ చేసి వదిలేయకుండా బిల్లు చేశాం అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
Read Also: CID Notice : మరోసారి విజయసాయిరెడ్డికి సీఐడీ నోటీసులు