AP, TS Elections : ఒకేసారి `ముందస్తు` దూకుడు!
ఒకేసారి ఎన్నికలకు వెళ్లడానికి తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ సిద్ధం అవుతున్నారా? వాళ్లిద్దరూ వ్యూహం ప్రకారం `ముందస్తు`కు ప్లాన్ చేశారా?
- By CS Rao Published Date - 12:18 PM, Mon - 11 July 22

ఒకేసారి ఎన్నికలకు వెళ్లడానికి తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ సిద్ధం అవుతున్నారా? వాళ్లిద్దరూ వ్యూహం ప్రకారం `ముందస్తు`కు ప్లాన్ చేశారా? అన్నదముల్లా మెలుగుతోన్న తెలుగు రాష్ట్రాల సీఎంల వ్యూహం ఏంటి? తెర వెనుక సాగుతున్నదేంటి? అనే దానిపై పొలిటికల్ సర్కిల్స్ లో నడుస్తోన్న చర్చ.
గుంటూరులో జరిగిన ప్లీనరీ వేదికగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు సిద్దం కావాలని క్యాడర్ కు దిశానిర్దేశం చేశారు. సాధారణంగా ఎన్నికల ఏడాది ఇలాంటి పిలుపు ఇస్తుంటారు. కానీ, ఇంకా రెండేళ్లు ఉండగానే జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు పిలుపు ఇవ్వడం గమనార్హం. అంతేకాదు, ఎన్నికల ప్రచారానికి ఎలా వెళ్లాలి? అనేది కూడా క్లారిటీ ఇచ్చారు. టిక్కెట్లు ఎవరికి ఇచ్చే అవకాశం ఉంది? అనే అంశాన్ని కూడా ప్రస్తావించారు. ఇప్పటికే బస్సు యాత్ర ద్వారా సామాజిక సమరభేరిని రాష్ట్ర వ్యాప్తంగా మోగించారు. గడపగడపకు వైసీపీ అంటూ క్షేత్రస్థాయికి లీడర్లను పంపారు. వన్స్ మోర్ అనే నినాదాన్ని కూడా తయారు చేశారు. సోషల్ మీడియా వేదికగా ప్రత్యర్థుల్ని చిత్తు చేయాలని డైరెక్షన్ ఇచ్చారు. ఇదంతా చూస్తుంటే, జగన్మోహన్ రెడ్డి `ముందస్తు`కు వెళుతున్నాడని సహజంగా వచ్చే అనుమానం. అంతేకాదు, ప్లీనరీ మరుసటి ముగిసిన మరుసటి రోజే ప్రభుత్వాన్ని రద్దు చేస్తానంటూ కేసీఆర్ చెప్పడం ఇద్దరి సీఎంల వాలకం చర్చనీయాంశంగా మారింది.
సాధారణ ఎన్నికలను మోడీ ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉందని చాలా కాలంగా చర్చ జరుగుతోంది. ఒక వేళ అదే జరిగితే, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తరువాత కేంద్రం `ముందస్తు` దిశగా యోచించే అవకాశం ఉంది. ఆ రాష్ట్రంలో వచ్చే ఫలితాల ఆధారంగా మరింత దూకుడుగా బీజేపీ వెళ్లే అవకాశం ఉంది. అంటే, వచ్చే ఏడాది ఏ టైంలోనైనా మోడీ ముందుకు వెళతారని కొన్ని వర్గాల్లోని చర్చ. అదే జరిగితే, సాధారణ ఎన్నికలతో పాటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కూడా వస్తాయి. అప్పుడు టీఆర్ఎస్ భారీగా నష్టపోయే ప్రమాదం లేకపోలేదు. అందుకే, వీలున్నంత ముందస్తుగా వెళ్లాలని కేసీఆర్ చాలా కాలంగా ప్రయత్నం చేస్తున్నాడని తెలుస్తోంది. కానీ, 2018 లో మాదిరిగా కేంద్రం నుంచి ఆయనకు సహకారం లభించడంలేదని సమాచారం. అందుకే, కేంద్రంపై ఇటీవల భగభగ మండిపడుతున్నారని ఆ పార్టీలోని కీలక లీడర్ల గుసగుసలు.
తెలుగు రాష్ట్రాల సీఎంలు ఇద్దరూ అన్నదమ్ముల మాదిరిగా కలివిడిగా ఉన్నారు. సాధారణ ఎన్నికల కంటే ముందుగా ఎన్నికలకు వెళితే వైసీపీకి అనుకూల ఫలితాలుంటాయని సర్వేల సారాంశమట. ఒకేసారి తెలుగు రాష్ట్రాల ఎన్నికలు జరగాలని టీఆర్ఎస్, వైసీపీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. కొన్ని సర్వేలను అధ్యయనం చేసిన తరువాత ఇరు రాష్ట్రాల సీఎంలు మాస్టర్ ప్లాన్ తో `ముందస్తు`కు స్కెచ్ వేశారని సమాచారం. అందుకు కారణాలు లేకపోలేదు.
ఇటీవల జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో సెటిలర్ల మద్ధతు ఉన్న చోట టీఆర్ఎస్ గెలుపొందింది. నార్త్ సెటిలర్లు ఉన్న చోట ఆ పార్టీ ఓడిపోయింది. సికింద్రాబాద్ పేరెండ్ గ్రౌండ్స్ లో జరిగిన సభలోనూ నార్త్ సెటిలర్లు ఎక్కువగా హాజరయ్యారని నిఘా వర్గాల సమాచారం. అందుకే ఏపీ సెటిలర్లు ఉండే సమయంలోనే ఎన్నికలకు వెళ్లాలని కేసీఆర్ భావిస్తున్నారట. సరిగ్గా ఇక్కడే జగన్మోహన్ రెడ్డి మరోలా ఆలోచన చేస్తున్నారని తెలుస్తోంది.
ఒక వేళ సెటిలర్లు ఏపీకి వస్తే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశం ఉందని సర్వేలు చెబుతున్నాయని వినికిడి. సుమారు 15లక్షల మంది ఏపీ సెటిలర్లు తెలంగాణ లో ఓటర్లుగా ఉన్నారు. వాళ్లలో ఎక్కువ భాగం జగన్మోహన్ రెడ్డి పాలనకు వ్యతిరేకంగా ఉన్నారని సర్వే ఫలితాలు చెబుతున్నాయట. అందుకే, ఏపీ సెటిలర్ల కోసం గాలం వేస్తోన్న కేసీఆర్ వద్దనుకుంటున్నో జగన్ ఒకేసారి ఎన్నికలకు వెళ్లాలని స్కెచ్ వేసినట్టు చర్చ జరుగుతోంది.
మొత్తం మీద ఎవరి ఈక్వేషన్ వేస్తోన్న తెలుగు రాష్ట్రాల సీఎంలు కలిసి ఎన్నికలకు ఒకేసారి వెళ్లాలని స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది. అందుకే, ఎన్నికలకు సిద్ధం కావాలని ప్లీనరీ వేదికగా జగన్ పిలుపునిస్తే,ఎన్నికల తేదీ చెబితే, ప్రభుత్వాన్ని రద్దు చేస్తానంటూ బీజేపీకి కేసీఆర్ సవాల్ చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే, ఇద్దరు సీఎంలు `ముందస్తు`కు దూకుడుగా ఉన్నారని అర్థం అవుతోంది.