నూతన విద్యా విధానంలో టి-సాట్ భాగస్వామ్యం.. మంత్రిని కోరిన సీఈవో వేణుగోపాల్ రెడ్డి
మంత్రి శ్రీధర్ బాబు ఈ ప్రతిపాదన పట్ల సానుకూలంగా స్పందించారు. ఐటి శాఖ పరిధిలో ఉన్న టి-సాట్ సేవలను విద్యా విధాన రూపకల్పనలో ఏ విధంగా వినియోగించుకోవచ్చో పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.
- Author : Gopichand
Date : 31-12-2025 - 8:57 IST
Published By : Hashtagu Telugu Desk
T-SAT: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించబోయే ‘నూతన విద్యా విధానం’లో టి-సాట్ నెట్‌వర్క్‌ను క్రియాశీల భాగస్వామిని చేయాలని ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు విజ్ఞప్తి అందింది. బుధవారం సచివాలయంలో మంత్రిని కలిసిన టి-సాట్ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి, ఈ మేరకు రూపొందించిన విధివిధానాల ప్రణాళికా పత్రాన్ని అందజేశారు.
డిజిటల్ విద్యలో అగ్రగామిగా టి-సాట్
ఈ సందర్భంగా సీఈవో వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. టి-సాట్ సాధించిన విజయాలను మంత్రికి వివరించారు. ప్రాథమిక, ఉన్నత, సాంకేతిక విద్యతో పాటు యూనివర్సిటీ స్థాయి విద్యార్థులకు కూడా టి-సాట్ డిజిటల్ పాఠాలను అందిస్తోంది. ప్రస్తుతం టి-సాట్ వద్ద 39 వేల వీడియో పాఠాలు అందుబాటులో ఉన్నాయి. 140 మిలియన్ల వ్యూస్ సాధించి, విద్యా రంగంలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. తెలంగాణలోని సుమారు 80 శాతం మంది చదువరులకు వివిధ విద్యా కార్యక్రమాల ద్వారా టి-సాట్ చేరువైందని ఆయన తెలిపారు.
Also Read: దేశంలో రెండో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టు రెడీ చేసిన ఏకైక సీఎం చంద్రబాబు!
భవిష్యత్ అవసరాల కోసం ప్రత్యేక ప్రణాళిక
రాబోయే రోజుల్లో విద్యా వ్యవస్థ పూర్తిగా డిజిటల్ మాధ్యమాలపైనే ఆధారపడే అవకాశం ఉన్నందున, టి-సాట్ ముందస్తుగానే భవిష్యత్ ప్రణాళికను సిద్ధం చేసిందని సీఈవో వివరించారు. “ఇటీవల నిర్వహించిన ‘యాన్యువల్ స్టూడెంట్ కాంపిటీషన్స్-2025’ ద్వారా గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు విద్యార్థులను, ఉపాధ్యాయులను సమన్వయం చేయగలిగాము. ప్రభుత్వం చేపట్టే నూతన విద్యా విధానంలో మాకు అవకాశం కల్పిస్తే, నాణ్యమైన డిజిటల్ కంటెంట్‌ను అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం” అని వేణుగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.
మంత్రి శ్రీధర్ బాబు ఈ ప్రతిపాదన పట్ల సానుకూలంగా స్పందించారు. ఐటి శాఖ పరిధిలో ఉన్న టి-సాట్ సేవలను విద్యా విధాన రూపకల్పనలో ఏ విధంగా వినియోగించుకోవచ్చో పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో టి-సాట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎండీ సాదిక్ కూడా పాల్గొన్నారు.