BRS Defecting MLAs: చేతులు కట్టుకొని కూర్చోవాలా.. మా నిర్ణయాన్ని స్పీకర్‌కు తెలియజేస్తాం : సుప్రీంకోర్టు
- By Pasha Published Date - 01:11 PM, Wed - 2 April 25

BRS Defecting MLAs: పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారంపై సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. పార్టీ ఫిరాయింపులను అడ్డుకునేందుకే రాజ్యాంగంలో 10వ షెడ్యూల్ ఉందని, అలాంటప్పుడు ఫిరాయింపులపై ఎలాంటి నిర్ణయాన్నీ తీసుకోకపోతే రాజ్యాంగాన్ని అవమానించినట్టే అవుతుందని పేర్కొంది. ఈ విషయంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకునేలా ఆదేశించాలని కేటీఆర్, కౌశిక్ రెడ్డి తరఫు న్యాయవాది ఆర్యమా సుందరం కోర్టును కోరారు.
కోర్టులు స్పీకర్‌ను ఆదేశించలేవు : ముకుల్ రోహత్గీ
కోర్టులు స్పీకర్‌ను ఆదేశించలేవని, సూచన మాత్రమే చేయగలవని తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీ ఈసందర్భంగా వాదించారు. ఈ కేసులో సింగిల్ బెంచ్ తీర్పును కొట్టేసిన డివిజన్ బెంచ్ తీర్పు సరైనదే అని ముకుల్ రోహత్గీ పేర్కొన్నారు. స్పీకర్‌కు గడువు విధించిన హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు సరికాదన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయ్, ఆగస్టీన్ జార్జ్ మసీహ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ వాదనలు విన్నది.
Also Read :Pak Vs India : నియంత్రణ రేఖను దాటొచ్చిన పాక్ ఆర్మీ.. ఏమైందంటే..
జస్టిస్ బీఆర్ గవాయ్ సంచలన వ్యాఖ్యలు
దీనిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ఫిరాయింపుల అంశంపై కోర్టులు ఇక చేతులు కట్టుకొని కూర్చోవాలా అని ప్రశ్నించారు.గతంలో కోర్టు ధిక్కరణ కేసులో అసెంబ్లీ స్పీకర్‌ను కూడా కోర్టులో నిలబెట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రాజ్యాంగంలో షెడ్యూల్-10 ఉండగా, ఫిరాయింపుల విషయంలో ఎలాంటి చర్య తీసుకోకపోతే, అది రాజ్యాంగాన్ని అవమానపరిచినట్లే అవుతుందన్నారు. తమ నిర్ణయాన్ని స్పీకర్‌కు తెలియజేస్తామని న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ స్పష్టం చేశారు. ఆర్టికల్ 142 ప్రకారం కోర్టుల శక్తి పరిమితమైనది కాదని తేల్చి చెప్పారు. సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసిన తర్వాతే తెలంగాణ అసెంబ్లీ స్పీకర్.. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారనే అంశాన్ని న్యాయమూర్తులు ఈసందర్భంగా ప్రస్తావించారు. ముగ్గురు ఎమ్మెల్యేలపై మూడు వేర్వేరు సమయాల్లో పిటిషన్లు దాఖలైనందున నోటీసుల జారీకి ఆలస్యమైందని సుప్రీంకోర్టు బెంచ్‌కు ముకుల్ రోహత్గీ తెలిపారు.