MLAs Defection Case: స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు మరోసారి ‘సుప్రీం’ నోటీసులు.. కారణమిదీ
2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో(MLAs Defection Case) చేరారు.
- Author : Pasha
Date : 23-03-2025 - 7:16 IST
Published By : Hashtagu Telugu Desk
MLAs Defection Case: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు సుప్రీంకోర్టు మరోసారి నోటీసులు ఇచ్చింది. ఇంతకీ ఎందుకు ? ఒకే అంశం విషయంపై ఆయనకు రెండోసారి దేశ సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు ఎందుకు పంపింది ?
Also Read :Nara Lokesh : స్వర్ణ దేవాలయాన్ని సందర్శించిన లోకేశ్, బ్రాహ్మణి, దేవాంశ్
10 మంది ఎమ్మెల్యేల విషయంలో..
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు వ్యవహారంపై సుప్రీంకోర్టు సీరియస్‌గా ఉంది. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో(MLAs Defection Case) చేరారు. దీనిపై బీఆర్ఎస్ తరఫున మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని వారు కోరారు. వారిపై చర్యలు తీసుకోకుండా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. గత విచారణ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర అసెంబ్లీ సెక్రటరీ, 10 మంది ఎమ్మెల్యేలు, ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. బీఆర్ఎస్ పిటిషన్‌పై మార్చి 22లోగా స్పందించాలని అప్పట్లో తెలంగాణ స్పీకర్‌కు సుప్రీంకోర్టు సూచించింది. అయితే ఆ గడువు ముగిసింది. దీంతో మరోసారి స్పీకరుకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసుపై తదుపరిగా మార్చి 25న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. వాస్తవానికి ఈ కేసులో తొలుత తెలంగాణ హైకోర్టు జోక్యం చేసుకుంది. ఫిరాయించిన ఎమ్మెల్యేలపై నాలుగు నెలల్లోగా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అయినప్పటికీ, స్పీకర్ చర్యలు తీసుకోకపోవడంతో సుప్రీంకోర్టును బీఆర్ఎస్ ఆశ్రయించింది.
Also Read :KTRs Convoy : కేటీఆర్ కాన్వాయ్‌లో అపశృతి.. ఏమైందంటే..
ఏ పార్టీ వైఖరి ఏమిటి ?
- తమ పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ కోరుతోంది.
- ఫిరాయింపులపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకునేందుకు కొంత సమయం ఇవ్వాలని కాంగ్రెస్ కోరుతోంది.
- ఈ కేసుపై న్యాయస్థానాల తీర్పులను గౌరవిస్తామని బీజేపీ అంటోంది.
- ఒకవేళ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు అనర్హత వేటు వేస్తే తెలంగాణలో ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.